పెద్ద కథలు » చిత్రకారుడు
   
 

గత సంచిక తరువాత భాగం

అసలు రవితో నా పరిచయం ఎలా జరిగిందంటే.... 

మా కంపెనీ ప్రచారంకోసం కంప్యూటర్‌నుంచి కొన్ని బొమ్మలు జెనరేట్‌ చేశాను. వాటికి కళాత్మక విలువలు ఆపాదించడానికి మా ఆఫీసుకి ఓ యాడ్‌ ఏజన్సీ నడిపే రవిని పిలిపించారు. అతడా బొమ్మలు చూసి, ''ఇవి డిజైన్‌ చేసిన కంప్యూటర్‌ ఇంజనీర్లో ఓ గొప్ప చిత్రకారుడున్నాడు'' అన్నాడు. 

''ఆ ఇంజనీర్ని నేనే! చిన్నప్పట్నించీ నాకు బొమ్మలేయడం హాబీ. చదువు రంధిలో పడి ఆ హాబీని నిర్లక్ష్యం చేసినా అడపాతడపా బొమ్మలేసేవాణ్ణి. హైస్కూల్లోనూ, కాలేజిలోనూ కూడా నా బొమ్మలకు బహుమతులొచ్చాయి. కానీ ఎవరూ నాలో గొప్ప చిత్రకారుడున్నాడని అనలేదు'' అని రవికి చెప్పాను.రవి నా బొమ్మలు చూడ్డానికి నా రూంకొచ్చాడు. చూశాక, ''హేయ్‌, నువ్వు సామాన్యుడివి కాదు'' అన్నాడు. నా బొమ్మలెందుకు గొప్పవో చెప్పి, చిత్రకళలో తనకి తెలిసిన కిటుకులు కొన్ని చెబుతానన్నాడు. 

ఆ తర్వాత నేనూ, రవీ చాలాసార్లు చాలాచోట్ల కలుసుకున్నాం. రవినుంచి నేను చాలా నేర్చుకున్నాను. అతడి సాహచర్యంలో నా చిత్రకళా ప్రావీణ్యం మరిన్ని మెరుగులు దిద్దుకుంది.

''నీకు గురుదక్షిణ ఇవ్వాలి'' అన్నానోసారి.

''నిన్ను పరిపూర్ణ చిత్రకారుడిగా చూసేక, తప్పకుండా నీనుంచి గురుదక్షిణ తీసుకుంటాను'' అన్నాడు రవి. 

''పరిపూర్ణత వచ్చినట్లు ఎలా తెలుస్తుంది?'' అన్నాను కుతూహలంగా.

''పరిపూర్ణ చిత్రకారుడిలో రసహృదయముంటుంది. కళాత్మక స్పందన ఉంటుంది. అదేమిటో తెలుసుకుందుకు రేపోసారి నువ్వు మా ఆఫీసుకి రా. నీకో పరిపూర్ణచిత్రం చూపిస్తాను'' అన్నాడు రవి.

ఆ మర్నాడు రవి ఆఫీసుకి వెళ్లాను. ఆ రోజు అతడు నన్ను అంతవరకూ చూపించని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే నేను దివ్యసుందరి బొమ్మ చూసి చేతులు జోడించాను. 

''స్త్రీ నగ్నత్వంలో దివ్యత్వాన్ని సందర్శించడం ఇద్దరికే సాధ్యం. ఒకరు పరిపూర్ణ కళాభిమాని. ఒకరు పరిపూర్ణతకు దగ్గిర్లో ఉన్న చిత్రకారుడు'' అన్నాడు రవి.

ఆ మాట వినగానే నాలో నిరుత్సాహం. ''ఊహలో కూడా స్త్రీ నగ్నదేహం నాలో ఉద్రేకం కలిగిస్తుంది మరి. ఇప్పుడలా జరుగలేదంటే - దివ్యత్వం ఆ బొమ్మదేకానీ నేను పరిపూర్ణతకు దగ్గిర్లో లేనన్నమాట'' అన్నాను.

''బొమ్మలో దివ్యత్వముండొచ్చు. కానీ అది గుర్తించడానికి కళాహృదయం ఉండాలి. ఇప్పుడు నీ ఎదుటనున్న ఈ బొమ్మని మామూలు ఆడదానిలా చూసేవాళ్లే ఎక్కువ. వాళ్లని తప్పు పట్టలేం కూడా. పడితే ముందు నాలో నేనే తప్పెంచాలి. ఎందుకంటే స్త్రీపురుషుల మధ్యనుండే ప్రకృతి సహజమైన ఆకర్షణకి నువ్వే కాదు, నేనూ అతీతుణ్ణి కాను. కానీ ప్రతి చిత్రకారుడికీ కేవలం చిత్రకళా ప్రేరణనే ఇచ్చే ఓ దివ్యసుందరి వేరే ఉంటుంది. ఆమె దర్శనభాగ్యం నాకు కలిగింది. ఆమె దివ్యత్వాన్ని చిత్రీకరించి, పరిపూర్ణుడనయ్యాను. నీకూ ఓ దివ్యసుందరి దర్శనభాగ్యం కలుగుతుంది. చిత్రకళలో పరిపూర్ణుడవౌతావు. ఇది నా మాటగా గుర్తుంచుకో'' అన్నాడు రవి.

''నగ్నత్వంలో దివ్యత్వాన్ని చూడ్డమే కళా పరిపూర్ణత అనిపించుకుంటుందా?'' అన్నాను అసంతృప్తిగా. 

''ఔను. ఎందుకంటే?'' అంటూ మొదలెట్టాడు రవి.

నల్లని నేలపై పచ్చని చెట్లు. రంగురంగుల పూలు. కొండలు. కోనలు. నదులు. జలపాతాలు. నీలాకాశంలో వెలిగే సూర్యుడు. వెన్నెలనిచ్చే చంద్రుడు. మినుకుమనే తారలు. రంగురంగుల మబ్బులు. ఈ రెంటి నడుమా జీవజాలం. పక్షులు. మృగాలు. సరీసృపాలు. సూక్ష్మజీవాలు. ఈ సృష్టినంతటినీ తన అదుపులోకి తీసుకోవాలనుకునే మనిషి. చుట్టూ కనిపించే ఈ సృష్టి అందాన్ని వర్ణించినప్పుడు మహాకవుల భావజాలం కూడా చంద్రునికో నూలుపోగే ఔతుంది. అలాంటి సృష్టి అందమంతా ఒకెత్తయితే సృష్టిలో ఆడదాని అందం ఒకెత్తు. ఆమె శరీరంలో అణువణువూ ఓ మహత్తర సౌందర్యానికి ప్రతీక. 

''ఆ మహత్తర సౌందర్యం నా హృదయాన్ని స్పృశించినప్పుడు - నా మనసు చివుక్కుమంటుంది. అందాలు దాచుకోవాల్సిన అగత్యం స్త్రీకి కలిగిందని!'' అన్నాడు రవి.

 

 

''ఇది మరీ బాగుంది. ఆడవాళ్లందరూ వివస్త్రలుగా తిరగాలనా నీ ఉద్దేశ్యం?'' అన్నాను కాస్త చిరాగ్గా.

రవి పట్టించుకోకుండా, ''సృష్టిలో స్థావర జంగమాది అనంత జీవకోటిలో ఏదీ వళ్లు దాచుకోదు. సృష్టికర్త బ్రహ్మ కూడా ఏ జీవికీ దుస్తుల్ని రచించలేదు. నగ్నసౌందర్య ప్రదర్శన ఈ సృష్టి పరమార్థం!'' అన్నాడు.

నాకీ అభిప్రాయం నచ్చలేదు. ''ఆ విషయం ఇప్పుడు మన సినీతారలు గుర్తించారులే'' అన్నాను వ్యంగ్యంగా.

రవికి అర్థమైనట్లుంది. ''ఇప్పటి సంగతి తర్వాత. మొదట్లో మనిషికి వళ్లు దాచుకోవడం తెలియదు. అనంతకోటి జీవజాలంలో తామూ ఒకటై - యథేచ్ఛగా సంచరించేవారు మనుషులు. కానీ భగవంతుడు మనిషికి మాత్రమే భిన్నమైన మెదడునిచ్చాడు. ఆ మెదడు మనిషిని మిగతా జీవజాలానికి భిన్నంగా మార్చేసింది'' అన్నాడు.

''మంచిదేగా! అందుకే గ్రహాంతరాలకు కూడా చేరేటంత ప్రగతి సాధించామిప్పుడు'' అన్నాను.

''ఔను. ఇతర గ్రహాల అన్వేషణలో పడి - మనమిప్పుడు భూమ్మీద సౌందర్యాన్ని ఆరాధించడం మర్చిపోయాం. పురుషుడు ఆడదానిలో ప్రకృతి సౌందర్యాన్ని చూడ్డానికి బదులు విలాసాన్ని చూడ్డం మొదలెట్టాడు. అందంపట్ల ఆరాధనకు బదులు కాంక్షను పెంచుకున్నాడు. మగాడి బలం ఆడదాని అందాన్ని అనుభవించడానికే అనుకునే దశకు చేరుకున్నాడు. మృగాలకైతే వేళాపాళా, సమయం సందర్భం ఉన్నాయి. మనిషికి అలాంటివేం లేకపోవడంతో ఆడదాని అందానికి చాటు తప్పనిసరయింది. అనాగరికమైన ఆలోచనల్ని అరికట్టడానికి - దుస్తులు ధరించడం నాగరికమైంది. మృగాలు బలాత్కార మెరుగవని తెలిసి కూడా - బలాత్కారానికి పాల్పడే పురుషుల్ని మృగాలతో పోల్చి వాటిని అవమానించడం ఆధునికత అయింది'' అన్నాడు రవి.

''నువ్వు చెప్పేది అర్థమైంది. ఇప్పుడు మనం సంస్కారాన్ని పునరుద్ధరించుకోవాలని నేనూ ఒప్పుకుంటాను. కానీ ఆదిమవాసుల్లా - నేటి పురవీధుల్లో మనిషి నగ్నంగా సంచరించాలంటే మాత్రం నేనొప్పుకోను'' అన్నాను.

రవి నవ్వి, ''చిత్రకారుణ్ణి. సృష్టిని చూసి పరవశిస్తాను. ఆ పరవశం కుంచె వశమై చిత్రవసనంపై రూపు దిద్దుకోగా, ఆ రూపం మనోల్లాసాన్నిస్తే అదో తృప్తి నాకు. అందమైన ఆడపిల్ల అందమైన దుస్తుల్లో కనబడితే - మసకబారిన కళ్లద్దాలలోంచి చూస్తున్న భావన కలిగి అసంతృప్తిగా ఉంటుంది నాకు. అర్థమైందా?'' అన్నాడు.

నేనొప్పుకోలేదు. ''చిత్రకారుడిగా భావుకత ఉన్నా, మనిషిగా వాస్తవం మరువకూడదు. సృష్టి ఆరంభానికీ, నేటికీ మధ్య మనిషిలో పరిసరాలకు తగిన మార్పులు చాలా వచ్చాయి. అవి మనిషిని ఉత్కృష్టుణ్ణి చేశాయి. ఇప్పుడాలోచించు. నీ తల్లి, చెల్లి నలుగురిలో వివస్త్రలుగా తిరగడాన్ని ఊహలోనైనా భరించగలవా?'' అన్నాను.

రవికి కోపం రావాలనే అంత దూరం వెళ్లాను కానీ రవి నన్ను చూసి ఉదాత్తంగా, ప్రశాంతంగా నవ్వాడు.

''ప్రతి ఆడదీ ఎవరో ఒకరికి తల్లి, చెల్లి. కానీ ఏం జరుగుతోందిప్పుడు? వళ్లంతా కప్పుకుని కనిపించినా కూడా - ఇప్పుడు ఆడదానిలో తల్లిని, చెల్లిని చూడగలవారెందరు? వారిని వివస్త్రలు చెయ్యడమే కాదు, క్రూరంగా అనుభవించాలన్న ఆలోచన కలుగుతున్నవారెందరు? నువ్వే చెప్పు రాజూ! '' అన్నాడతడు. 

అప్పుడు నాకు రోజూ దినపత్రికల్లో మొదటి పేజీకి తరలి వస్తున్న ఎందరో నిర్భయలు గుర్తుకొచ్చారు. నోట మాట రాలేదు. కానీ ఇంతకీ అతడు నాకు చెప్పదల్చుకున్నదేమిటి? దీనికీ చిత్రకళకీ ఏమిటి సంబంధం?

రవి చెప్పాడు, ''మనం కనిపెట్టిన దుస్తులు మన దౌర్భాగ్యానికి చిహ్నాలు. మన దుష్టత్వంవల్ల మన శరీరాలకి పడిన సంకెలలు. వీటినుంచి మనమెలాగూ బయటపడలేం. మనసులో ఏ వికారమూ లేకుండా ఓ దివ్యసుందరి నగ్నత్వాన్ని చిత్రీకరించగల అవకాశం కళాకారులకే ఉంది. కవి దివ్యత్వాన్ని మాటలతో స్తుతిస్తాడు. చిత్రకారుడు, శిల్పి చేతలతో - దివ్యత్వానికి రూపాన్నిస్తారు. ఆ ఆనందం అనుభవైకవేద్యం. కళామతల్లికి నైవేద్యం'' అన్నాడు.

రవి మాటల అంతరార్థం అప్పటికి అర్థమైంది నాకు. నాకోసం ఎక్కడో ఓ దివ్యసుందరి ఎదురుచూస్తోంది. రవికి లాగే నేనూ ఆమెను చిత్రీకరించి నా చిత్రకళను సార్థకం చేసుకోవాలి. 

నిజంగా అలాంటి దివ్యసుందరి ఉందా, ఉంటే ఎప్పటికైనా నాకు తటస్థపడుతుందా - అనుకున్నాను కానీ చిత్రని మొదటిసారి చూడగానే నా అనుమానం తీరిపోయింది. ఆమెపై నాకు కాంక్ష లేదు. వాంఛ లేదు. ఆమె ఆనుమతితో నా చిత్రకళని సార్థకం చేసుకోవాలన్నది నా కోరిక. కానీ ఆమె నమ్ముతుందా, ఒప్పుకుంటుందా? 

చిత్రకి చిత్రకళపై మోజుండవచ్చు. నాపై అభిమానమూ ఉండొచ్చు. నాచేత పోర్ట్రయిట్‌ గీయించుకోవాలన్న అభిలాష కూడా ఆమెకుండొచ్చు. కానీ తనో మధ్యతరగతి ఆడపిల్ల. కట్టుబాట్లలో పెరిగింది. నా కోరిక ఆ కట్టుబాట్లకు విరుద్ధం. నేనామె పోర్ట్రయిట్‌ ఎలా వెయ్యాలనుకుంటున్నానో తెలిస్తే నన్నెలా అర్థం చేసుకుంటుంది? 

ఆమెకి నా మనసులో మాట ఎలా చెప్పాలా అనుకుంటూండగా - రమేష్‌ ఓ రోజు, ''చాలా రోజులుగా నీ వ్యవహారం చూస్తున్నాను. నీకు చిత్ర బాగా నచ్చితే చెప్పు. పెద్దగా కట్నమిచ్చుకోలేరు కానీ, వాళ్లది సంప్రదాయ కుటుంబమే. నేను పెళ్లిపెద్దనై మీ ఇద్దర్నీ ఒకటి చెయ్యగలను'' అన్నాడు నాతో. 

   
Untitled Document