శీర్షికలు »
   
 
తెలుగు సినిమా నటిగా మరియు గాయనిగా పేరుగన్న ఉడుతా సరోజిని అసలు పేరు మల్లెబోయిన సరోజిని. ఈమె 1937లో జన్మించింది.తల్లి తండ్రులు--అన్నపూర్ణమ్మ, గోపాలకృష్ణ గార్లు.వీరి స్వస్థలం ఏలూరు.ఆమె తండ్రి గారు మంచి రంగస్థలం హాస్య నటులు.'సత్యమే జయం','పెద్దమనుషులు'చిత్రాల్లో చిన్న హాస్య పాత్రలను పోషించారు.కళాకారుల కుటుంబంలోనిది కావటం వల్ల ఆమెకు మంచి గాత్రం వచ్చింది.ఆ నాటి ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి గారు ఈమె సంగీతాన్ని విని ముచ్చటపడేవారు. ఆయన సిఫారసుతో ఆమెకు భరణీ వారి 'రత్నమాల'లో ఒక బాలిక వేషం లభించింది.అయితే ,కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది.వేషం మిస్ అయింది కదా అని కనీసం ఒక పాటైనా పాడించాలనే నిర్ణయానికి వచ్చారు వారు .

పదేళ్ళు నిండకుండానే బేబి సరోజినిగా భరణీ పిక్చర్స్ వారి రత్నమాల (1947) చిత్రంలో తొలిసారిగా 'దారి తెలియదాయే అమ్మా' అనే పాటను గానంచేసి సినీరంగ ప్రవేశం చేసింది. సంగీత దర్శకుడు సుబ్బరామన్ ఆమెకు ఓనమలు దిద్దించారు. ఆ పాట బాగుండటంతో 'రత్నమాల'లోనే మరొక పాటను కూడా పాడించారు. నాగయ్య గారి 'త్యాగయ్య'లో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'యోగి వేమన'లో,'బాలరాజు'లో పాడింది. ఈమె గాత్రం ఎక్కువగా చిన్నపిల్లల పాటలకు అందంగా అమరుతుందని భావించేవారు. హీరోయిన్స్ కు ఈమె పాడింది తక్కువ. విజయావారి పెళ్ళిచేసి చూడులోని-బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా ,ఎక్కడనుండొచ్చారు మీరు బల్ చక్కని రాజులు,అమ్మా నొప్పులే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 

ఈమె పాడిన పాటలలో దేవదాసులోని చిన్న పార్వతికి పాడిన ఓ దేవదా చదువూ ఇదేనా, మాంగల్యబలంలో హాయిగా ఆలూమగలై కాలం గడపాలి,వెలుగు నీడలులో శివగోవింద గోవింద చెప్పుకోదగ్గవి.శభాష్ రాముడు చిత్రంలోని జయమ్ము నిశ్చయమ్మురా అనే సందేశాత్మక గీతాన్ని ఉత్తేజం కలిగించేలా పాడారు. ఈమె యోగి వేమన (1947) మరియు బాలరాజు (1948) చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు స్వయంగా పాడుకున్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి వీరాంజనేయ చిత్రంలో 'రామ నామమే మధురం' పాటను,    ఎస్. వరలక్ష్మితో కలిసి సతీ సావిత్రి తో 'నమ్మితినే జననీ' పాటలను ఆలపించారు. 

బాలాంత్రపు రజనీకాంతారావు గారి ప్రోత్సాహంతో కొన్ని రేడియో గీతాలను పాడారు.కొన్ని సంగీత కచేరీలలో పాల్గొన్నారు.ఆమె భర్త రాచూరి శ్రీనివాసరావు గారు ఆదుర్తి సుబ్బారావు, మధుసూదనరావు గార్ల వద్ద కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేసారు. తర్వాత ఇద్దరి సినీ జీవితాలు మసకబారాయి. 1996 లో హైదరాబాద్ కు మకాం మార్చారు! ఆమె భర్త శ్రీనివాసరావు గారు 'ఈటీవీ' లో డబ్బింగ్ పర్యవేక్షకుడిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కొడుకు కన్నడ సినీ పరిశ్రమలో ఎడిటర్ గా స్థిరపడ్డాడు,రెండో కుమారుడు ఛాయాగ్రహణ శాఖలో పనిచేసాడు.రెండో కుమారుడు 1990 లో రోడ్ ప్రమాదంలో మరణించాడు.1993 లో విజయవాడలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు ఈమెను లతా మంగేష్కర్ సన్మానించింది!అదే ఆమె పొందిన మొదటి మరియు చివరి సన్మానం.

ఈమె 1999 నుండీ కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.అలనాటి మధుర గాయనీమణి శ్రీమతి ఉడుతా సరోజినిని  తెలుగువారు మరచిపోయారు. మరుగున పడిపోయిన ఈ మాణిక్యాన్ని కనీసం సినీ పరిశ్రమవారు కూడా మరచిపోవటం దురదృష్టం.ఈమె ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియటం లేదు.ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది! 75 సంవత్సరాల తెలుగు సినిమా ఉత్సవాలలో కూడా ఈమెను కనీసం సత్కరించకపోవటం చూస్తుంటే,పరిశ్రమ ఒక వర్గం ఆధిపత్యంలో ఉన్నదని అనిపిస్తుంది. సినీపరిశ్రమే తమ కళాకారులను చిన్నచూపు చూడటం క్షమించరాని నేరం.చూస్తుంటే,పరిశ్రమవారి దగ్గర కళాకారులను గురించి సరైన సమాచారం కూడా లేదనిపిస్తుంది."నా పాటలన్నీ ఒక కాసెట్టుగా చూసుకోవాలని ఉంది. అదొక్కటే నా కోరిక. ఆ తరుణం వస్తుందా?".ఇదీ ఆమె కోరిక. ఆ గాయనీమణి కోరిక తీర్చగలిగిన వారు నిజంగా ధన్యజీవులు.మొన్న 'ఈ టీవీ సినిమాలో' శభాష్ రాముడు సినిమా చూడగానే ఈమె పాడిన అద్భుతమైన పాట 'జయమ్ము నిశ్చయమ్మురా' వినగానే ఈమె గుర్తుకు వచ్చింది. ఈ వ్యాసాన్ని చదివి, మరి నలుగురికి ఈ గాయనీమణిని గురించి తెలియచేయగలరు.        

కళాకారుల కంటినీరు సభ్య సమాజానికి,సినీపరిశ్రమకు, ప్రభుత్వాలకు,ఐశ్వర్యవంతులకు కనువిప్పు కలిగించాలి!