శీర్షికలు »
   
 

నారాయణతే నమో నమో
రాగం : బేహాగ్

ప ||నారాయణతే నమో నమో
నారత సన్నుత నమో నమో ||

1. చ. ||మురహర భవహర ముకుందమాధవ
గరుడగమన పంకజనాభ
పరమ పురుష భవ బంధ విమోచన
నరమృగ శరీర నమో నమో ||

2. చ. ||జలధి శయన రవి చంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూ వల్లభ
నలినోదర తే నమో నమో ||

3. చ. ||ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్దర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో ||

అర్ధములు :
నార = విజ్ఞానం;  ద = ఇచ్చువాడు;

వివరణము :
నీరు నివాసముగా గలిగిన నారాయణుడు – పితృ దేవతలకు సదా జలవసతి కలిగించేవాడు నారదుడు – సర్వ శబ్దాలకు ఆధారభూతుడైన వానిగా నారాయణ పదానికి అర్ధం ఉంది –
అను నిత్యం నారాయణ శబ్దోచ్ఛారణ తో నరసమూహ పాపాన్ని ఖండించే మహిమ గలదిగా నారద పదానికి మరో పరమార్ధం ఉంది. శ్రీ మహా విష్ణువు పరమ పురుష ఆకారమైన వాడు. మురహర, ముకుంద, మాధవ నామాలు అతనివే. భవ బంధాలను హరించి మోక్షాన్నిచ్చే గరుడ గమనుడు –
హిరణ్యకశిపుని వంటి అహంకారి లోని ఇహ లోక విషయ విషపు నాడులు చీల్చి, భవ రోగ తిమిరాన్ని పారద్రోలిన నారసింహుడు ఆ నారాయణుడే!!

పన్నగశాయియైన విష్ణువుకు పాలకడలే పడకటిల్లు – సూర్య చంద్రులే నయనాలు! ఇక పాదాలు- బలి చక్రవర్తిని అణిచిన సందర్భాన బ్రహ్మాభిషిక్తమైనవి – తానొక్కడే పురుషోత్తముడై మిగిలిన పాశబద్ద జగత్సర్వస్వము. గోపవధూ వర్గమై అలరారగా వెలుగులీనే పద్మనాభుడు ఆది వరాహమూర్తిగా వేద వేద్యుడై .... వేదాలలో సామవేదమై శోభిల్లే మురళీధర మోహన రూపుడైన శ్రీ వేంకటనాయకుడు – వేదోద్ధారుడు – నాద ప్రియుడు.