మానిని! నా కథ చెప్పడం మొదలుపెడుతూ భక్తకవి పోతన “పుట్టెనొక మానిని రుక్మిణి నా బ్రసిద్ధయై” అన్నాడు! అవును! తనని తాను ఎక్కడ నిలుపుకోవాలో అక్కడ నిలుపుకోగలిగిన స్త్రీ... అఘాతంలోకి జారబోతూన్న జీవితాన్ని ఒడుపుగా పట్టుకుని స్త్రీగా కాదు అసలు మనిషిగా జన్మించినందుకు సార్థకత ఏమిటో దానిని సాధించుకోగలిగిన స్త్రీ.... అలా సాధించుకునేందుకు ఆ జగజ్జననిని ఎలా ప్రార్థించాలో... కళ్ళముందు కనబడే భూసురోత్తములకి ఎలా నమస్కరించి వేడుకోవాలో తెలిసిన స్త్రీ... ఆమె మానిని! ఇది నా గురించి నేను గర్వంగా చెప్పుకోవడం కాదు! నా అదృష్టాన్ని తల్చుకుని మురిసిపోవడం! అదృష్టం కాకపోతే ఏమిటది! ఎప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో అంత చక్కగా స్పురించడం! అనుకున్నది అనుకున్నట్లూ అలా జరిగిపోవడం! ఉహు... అది కూడా కాదు. నా అదృష్టం అక్కడ లేదు! కోరుకున్నది జరగడంలో లేదు నా సౌభాగ్యం. అసలు మొదట ఏమి కోరుకోవాలో తెలియడంలో వుంది. పెళ్ళి కావాలని ఎందరు ఆడపిల్లలు కోరుకోలేదు! యవ్వనం ఉదయించిన ప్రతి కన్నెపిల్లకీ కలలు ఉంటాయి. అర్హతతో సంబంధం లేకుండా ఆశలూ ఉంటాయి. కానీ ఎవరి గుణములు వింటే దేహతాపాలు తీరిపోతాయో, యే శుభాకారుడిని చూస్తే కళ్ళకి అఖిలార్థలాభాలూ కలుగుతాయో, ఎవరి పాదసేవ చేస్తే భువనోన్నతత్వాన్ని పొందవచ్చో, ఎవరి దివ్యనామస్మరణతో బంధాలు సడలిపోతాయో ఆ కంసారి కరుణని కోరుకోవాలని తెలియడం అది కదా నా భాగ్యం! కంసారి! అవును పుట్టకముందు నుంచే కంసుడికి శత్రువట ఆయన! అతగాడిని, ఆ దుష్ట కంసుడిని పుట్టక ముందు నుంచీ భయపెట్టి భయపెట్టి పాలు త్రాగే పసివాడుగా ఉన్నప్పుడు కూడా వణికించి చివరకి అన్నగారితో కలిసి సంహరించేశాడట! ఆ కంసుడి భార్యలు అస్తి ప్రాస్తి అనేవాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ మగధ రాజైన జరాసంధుని కుమార్తెలు. ఆ జరాసంధుడు యిరవై మూడు అక్షౌహిణుల సేనని తీసుకుని నా స్వామిపై యుద్ధానికి వెళ్ళాడట. వింటున్నారా! ఇరవై మూడు అక్షౌహిణులు... మీరు అంతకు ముందూ ఆ తర్వాతా జరిగిన ఎన్నో మహాయుద్ధాల గురించీ వాటిల్లో పాల్గొన్న సేనల గురించీ వినే వుంటారు. ఇరుపక్షాలు కలిపి కూడా కాదు... ఇలా ఒకేవైపున యిరవై మూడు అక్షౌహిణుల సైన్యం వుండడం దానినంతటినీ జయించడం! వినడానికే అద్భుతంగా వుంది కదా! అవును ఆయన గురించి ఇటువంటి కథలన్నీ వినేదాన్ని నేను. వింటూ వుంటే ఒక పక్కన ఆయన ఎంత వీరుడో తెలుస్తూ వుండేది, మరొక పక్కన ఎంతటి కొంటెవాడో కూడా తెలుస్తూ వుండేది. తన మేనమామకి మామగారు కదా ఆ జరాసంధుడు! అంతటి బలవంతుడు కదా! అంత పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చాడు కదా! ఆయనని చేతికి చిక్కించుకుని కూడా చంపకుండా వదిలి పెట్టి “దుఃఖింపం బనిలేదు, పొమ్ము, బలసందోహంబులం దెమ్ము” అంటాడట జంకూ గొంకూ లేకుండా ప్రతిసారీ! పాపం ఆ జరాసంధుడు అవమానం భరించలేక తగిన ప్రతీకారం చేయనూ లేక భూమ్మీద వున్న దుష్టరాజులందరినీ కూడగట్టుకుని పదిహేడు సార్లు దండెత్తి వెళ్ళాడట మధుర పైకి. పదునెనిమిదో సారి మళ్ళీ దండయాత్రకు వెళ్ళేందుకు అతగాడు సిద్ధపడుతుంటే మరొక పక్కన నారద మహర్షి కాలయవనుడి దగ్గరికి వెళ్ళి అతనిని కూడా మధురపై యుద్ధానికి వెళ్ళేందుకు ఉసిగొలిపాడట! బ్రహ్మర్షి కదా! ఆ కాలయవనుడికి పట్టబోయే గతి యేమిటో ఆయనకి ముందే తెలిసి వుంటుంది. అవును, నాస్వామి ఆ యవనుడిని ఎలా మాయ చేస్తాడో ముందే తెలిసిన వాడిలాగా పాపం ఆ అమాయకుడు గుర్తుపట్టడానికి వీలుగా అతని దగ్గర కూర్చుని చక్కగా వివరంగా వర్ణించాడట. నీలజీమూత సన్నిభ శరీరము వాడు తామరసాభ నేత్రముల వాడు పూర్ణేందుబింబంబు బోలెడి మోమువాడున్నత దీర్ఘబాహువులవాడు శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు కౌస్తుభ మణి పతకంబువాడు శ్రీకర పీత కౌశేయ చేలమువాడు మకరకుండల దీప్తి మలయువాడు రాజ! యింతంతవాడనరాని వాడు మెఱసి దిక్కులనెల్ల మెఱయువాడు తెలిసి యే వేళలందైన దిరుగువాడు పట్టనేర్చిన గాని లోబడనివాడు ఆ వర్ణన వింటూ ఉంటేనే మనసు పరవశిస్తుంది కదా! ఇలా చెప్పి రెచ్చగొట్టగానే కాలయవనుడు మూడు కోట్ల మ్లేచ్ఛ సైన్యంతో మధురని ముట్టడించాడట. అప్పుడు ఆ యదుకులమోహనుడు “ఇక్కడ మనం ఒక పక్కన యవనుడితో యుద్ధం చేస్తుంటే మరొక వైపు నుంచి జరాసంధుడు యుద్ధానికి వస్తే యాదవులకి ప్రమాదం” అని ముందే ఊహించి అప్పటికప్పుడు సముద్ర మధ్యంలో ఒక నగరాన్ని నిర్మింప చేశాడట! విశ్వకర్మ నిర్మించిన ఆ ద్వారకా పట్టణం అందాన్ని గురించి అందరూ వర్ణిస్తూ వుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో! ఆ ద్వారకా నగర నిర్మాణం గురించి విని ఇంద్రుడు సుధర్మ అనే సభాభవనాన్ని పంపాడట. ఇంకా వరుణుడు, కుబేరుడు, తక్కిన లోకపాలకులందరూ కూడా కానుకలు పంపారట. ఆ తర్వాత ఆ దేవకీనందనుడు మథురావాసులందరినీ ఎవరికీ తెలియకుండా ద్వారకాపురికి పంపించి తానొక్కడూ నగరం వెలుపలికి వచ్చి నిరాయుధుడిగా నడవడం మొదలు పెట్టాడట. అక్కడికి వచ్చిన కాలయవనుడు ఆయనని గుర్తు పట్టాడట... మరి నారదుల వారి వర్ణనని విని ఉన్నాడుగా! మురళీమోహనుడు నిరాయుధుడిగా ఉన్నాడు కదా అని యవనుడు తానూ ఆయుధం పక్కన పెట్టి పాదచారియై ఆయన వెంట పడ్డాడట... ఆగు ఆగమంటూ. అప్పుడా గోవిందుడు అందినట్లే అందుతూ అంతలోనే దూరమవుతూ యవనుడిని పరుగెత్తించి పరుగెత్తించి చివరికి ఒక కొండగుహలోకి వెళ్ళి మాయమయిపోయాడట! తీరా ఈ యవనుడు ఆ గుహలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరో నిద్రపోతూ కనిపించారు. అలా నిద్రిస్తున్నది మాధవుడేననుకుని కోపంతో కాలితో తన్నాడు యవనుడు. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూశాడు. ఇతగాడు భస్మమయిపోయాడు. అవును మరి! ఆ యవనుడికి మాధవుని చేతిలో మరణించే యోగం లేదు! ఇంతకీ అక్కడ గుహలో నిద్రిస్తున్న వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత చక్రవర్తి కుమారుడైన ముచుకుందుడు. అతడు రాక్షసుల వలన బాధలు పడుతున్న దేవతలకు రక్షగా చాలాకాలం రాజ్యాన్ని, భార్యా పుత్రులని వదిలి దేవతలతో ఉండిపోయాడు. చివరికి ఎప్పటికో కార్తికేయుడు దేవతలకు సేనానాయకుడు అయ్యాడు. అప్పుడు దేవతలు ముచుకుందుడిని “ఇన్నాళ్ళు నువ్వు మాకు చేసిన సాయానికి ప్రతిఫలంగా యేమైనా వరం కోరుకో”మని అన్నారు. దానికి అతడు అన్నాళ్ళు నిద్రలేకుండా వారి రక్షణ బాధ్యతని స్వీకరించి ఉన్నవాడు కనుక నిద్రని వరంగా కోరుకున్నాడు. అలా అతడు ఆ కొండగుహలో నిద్రిస్తూ ఉండిపోయాడు. ముచుకుందుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షణతకి యవనుడు భస్మమయి పోయాడు కదా, ఆతర్వాత నీలమేఘశ్యాముడు ముచుకుందుని ముందు నిలిచాడు. అపుడు ముచుకుందుడు ఆయనకి నమస్కరించి “నీ తేజస్సు నేను భరించలేకపోతున్నాను, నిన్ను ఎక్కువసేపు చూడలేక పోతున్నాను, నీవెవరివి?” అని అడిగాడట. అంతకు ముందు క్షణం క్రితం తన కంటిలోని మంటతో ఒకరిని భస్మమే చేయగలిగినవాడు కనీసం చూడనైనా లేకపోతున్నాననడం! ఎంత ఆశ్చర్యం! గుర్తించగలిగినవారికి ఆయన తేజస్సు అలా కనిపిస్తుందన్నమాట! గుడ్డివాళ్ళకి ఆ వెలుగు తెలియదన్నమాట! అప్పుడు ముంచుకుందుడితో గోవర్ధన గిరిధారి తానెవరో చెప్పి “నేను నిన్ను అనుగ్రహించేందుకే వచ్చాను, యేదైనా వరం కోరుకో”మన్నాడట. మనసు పరిపాకం చెందినవాడు కనుక ముచుకుందుడు కోరికలే వద్దని కోరుకున్నాడు. వాసుదేవుడు అందుకు సంతోషించి “నీకు ఇంకొక జన్మ వుంది, ఆజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి సర్వ భూతహితబుద్ధితో ప్రవర్తించి ఆ తర్వాత నన్ను చేరుకుంటావు” అని చెప్పాడు. ముచుకుందుడు మిగిలిన జీవితాన్ని తపస్సులో గడిపేందుకు వెళ్ళిపోయాడు. అతనిని అలా పంపించాక గోవిందుడు మధురానగరిని ముట్టడించిన యవనసేనలన్నిటినీ మట్టుబెట్టాడట. ఆతర్వాత మళ్ళీ జరాసంధుడు దండెత్తి వచ్చినపుడు జనార్ధనుడు అతని అన్నగారూ - ఇద్దరూ భయపడినవారిలా నటిస్తూ పారిపోయారు. వారిని వెంబడించిన జరాసంధుడికి చిక్కకుండా ప్రహర్షణ పర్వతం పైకి ఎక్కి ఆ శిఖరం మీదనుండి అవతలి వైపుకి దూకి ద్వారక చేరుకున్నారట. జరాసంధుడేమో పర్వతానికి నాలుగు వైపులా మంటలు పెట్టించి, ఆ మంటలు కొండ నలుదిక్కులని కమ్ముకున్నపుడు యదువీరులిద్దరూ బయటకి వస్తారని కాపు కాశాడు. వారు ఎన్నాళ్ళకూ రాకపోయే సరికి మంటల్లో దగ్ధమయ్యారనుకుని వెనుదిరిగి మగధకు వెళ్ళిపోయాడు. ఇటువంటి కథలు ఎన్నో విన్నాను నేను మాయింటికి వచ్చిన అతిథుల నుండి. గోవిందుని అన్నగారైన బలరాముల వారి వివాహం బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం రైవతుని కుమార్తె రేవతితో జరిగిందట. ఇక నా వివాహం జరగవలసి వుంది. అదీ జరుగుతుందనే అనుకున్నాను. ఎందుకంటే నా వివాహం నందనందనుడితో జరిపించడానికి నా తండ్రిగారికి యెటువంటి అభ్యంతరమూ లేదు. సమస్య అంతా నా సోదరునితోనే! నాతండ్రి భీష్మకుడు. విదర్భ దేశాధిపతి. కుండినపురం మా రాజధాని నగరం. నాకు అయిదుగురు అన్నలు. రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మమాలి అనేవి వారి పేర్లు. చిన్నతనం నుండీ వేణుగోపాలుడి కథలు వినీ వినీ నేను ఆయన పట్ల ఆకర్షితురాలనయానని నా తండ్రికి తెలుసు. అందుకే ఆయన నా వివాహం నాకు ఇష్టమైన చోటే జరిపించాలని అనుకున్నాడు. కానీ నా అన్న రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు. అతని దృష్టిలో వరుడిగా చేది రాజైన శిశుపాలుడు వున్నాడు. అప్పుడు... అంతటి ప్రమాదం ఎదురవుతుందని నాకు అర్థమయినపుడు ఇక నాకు సాహసించక తప్పలేదు. ఒక బ్రాహ్మణోత్తమునితో నాబాధ అంతా చెప్పుకుని ఆయన ద్వారా ద్వారకానాథునికి సందేశం పంపించాను. లోకంలో అన్నిరకాల స్త్రీలూ ఉన్నారు.... నా కళ్యాణ ఘట్టాన్ని చదవడమే ఒక మంగళకరమైన విషయమనీ అది తమకూ శుభములనిస్తుందనీ భావించేవారు, నన్ను ఒక పవిత్రస్వరూపిణిగా పూజించేవారు వున్నారు. పెద్దల అభీష్టానికి విరుద్ధంగా తాను కోరుకున్నవాడితో వెళ్ళిపోయేందుకు పథకాలు వేయగలిగిన జాణగా నన్ను పరిగణించేవారు, నాకథ చదివితే ఆడపిల్లలకి అటువంటి నేర్పు సిద్ధిస్తుందంటూ పరిహసించేవారూ ఉన్నారు. మొదటివారి దృష్టి నా స్వభావం మీద వుంది. నా సాధన మీద వుంది. చిన్నతనం నుంచీ నేను చేసిన తపస్సు మీద వుంది. ఒకానొక విపత్కర పరిస్థితి వచ్చినపుడు నేను చూపించక తప్పని తెగువతో వారికి సంబంధం లేదు. రెండవవారికి ఆ చర్య పైన మాత్రమే ఆసక్తి. వారనుకుంటున్నట్లు కనిపించిన వాడితో యోగ్యతాయోగ్యతలు ఆలోచించకుండా వెళ్ళిపోవడం కాదది! పెద్దలని ఎదిరించి నా ఇష్టప్రకారం వ్యవహరించడం కాదు. ఆమాటకి వస్తే నేను నాస్వామిని అంతవరకూ కళ్ళతో చూడనేలేదు. పెద్దలు ఆయన గుణగణాల గురించి పదే పదే చేసిన ప్రశంసలు విని ఆయన యెవరో మనసుతో తెలుసుకుని ఆయనని ఆరాధించాను. నేను పెద్దవారిని ఎదిరించలేదు. నా తండ్రి తీసుకున్న నిర్ణయం పట్ల విధేయత చూపించకుండా అహంకారంతో నా జీవితాన్ని శాసించాలనుకున్న నా అన్నగారిని అడ్డుకోదలిచాను. నిజానికి నేను ఎదిరించడానికి అసలు పెద్దవారెవరూ పురుషోత్తముని వరించాలన్న నా నిర్ణయాన్ని తప్పుగా పరిగణించనూ లేదు. ఆ తప్పు చేయవద్దని నాకు చెప్పనూ లేదు. నా తండ్రీ బంధువులే కాదు... మా కుండిన నగర ప్రజలందరూ కూడా “తగు నీ చక్రి విదర్భరాజసుతకుం దథ్యంబు వైదర్భియుం దగు నీ చక్రికి" అని అభిప్రాయపడినవారే! అంతే కాదు... “మా అందరి పుణ్యాలూ ఫలియించి ఇతగాడు మా రుక్మిణిని చేపట్టాలి.” అని ప్రార్థించారు కూడా. నా వివాహం కోసం తమ పుణ్యాలనే ధారపోయాలనుకున్న వారందరికీ నేనేమి ఇవ్వగలను! ఆ మాటకొస్తే నేను ప్రార్థించి పంపిన అగ్నిద్యోతనుల వారికి మాత్రం నేనేమి ఇవ్వగలను! ఆయన విదర్భ నుంచి ద్వారక దాకా ప్రయాణించి గొప్ప భాగ్యం వుంటే తప్ప ప్రవేశించలేని ద్వారకలో ప్రవేశించి స్వామిని దర్శించాడట. అప్పుడు ఆ మధుసూదనుడు తాను కూర్చున్న పీఠం మీద నుండి లేచి ఆయనని కూర్చోబెట్టి పూజించి చక్కటి భోజనం పెట్టి ఆ తర్వాత ఆయన దగ్గర కూర్చుని పాదాలొత్తుతూ ఆయన రాకకి కారణం అడిగాడట! బ్రాహ్మణులంటే అంత గౌరవం ఆయనకి! అంత భక్తి! అపుడు అగ్నిద్యోతనులవారు యెంతగానో సంతోషించి నా సందేశాన్ని తెలియచేశారట.... నా భక్తినీ నా వేదననీ కూడా నా మర్యాద చెడని విధంగా స్వామికి వివరించగల విద్వన్మణి ఆయన. నా గురించి వివరంగా చెప్పడమే కాదు “ఆ ఎలనాగ నీకు దగు నంగనకుం దగు నీవు!” అని కూడా అన్నారట! ఆ మాటలు విన్న నీరజాక్షుడు నవ్వుతూ “రుక్మిణి నన్ను ఆరాధించడమే కాదు, నా మనసూ రుక్మిణి మీదే లగ్నమయింది. ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొని ఆమెని స్వీకరిస్తాను” అని మాట ఇచ్చాడట. ఆతర్వాత తన రథసారథి అయిన దారుకుని పిల్చి రథం సిద్ధం చేయమని చెప్పాడట. శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే నాలుగు గుర్రాలను పూన్చిన రథం తీసుకుని సారథి రాగానే ముందుగా అగ్నిద్యోతనులవారిని కూర్చుండ బెట్టి ఆ తర్వాత తానూ రథాన్ని ఆరోహించి విదర్భకు విచ్చేశాడు. ఇటు చేది రాజకుమారుడు శిశుపాలుడికి అండగా సాళ్వ మాగధ రాజులే కాక దంతవక్త్రుడు, పౌండ్రకుడు వంటి ఎందఱో రాజులు విదర్భకు వచ్చారు. అటు నాస్వామి నా సందేశం అందిన వెంటనే తన రథంలో ఒంటరిగానే బయల్దేరి వచ్చినా యుద్ధం జరుగవచ్చునన్న అనుమానంతో ఆయన వెనుకనే బలరామదేవులు పెద్ద సైన్యంతో బయలుదేరి వచ్చారు. విప్రోత్తముడు నా కనుల ముందుకు వచ్చి విషయాలన్నీ చెప్పేవరకూ నేను పడిన కలవరం అంతా ఇంతా కాదు. “భూసురులు గమ్యం చేరారో లేదో, సందేశం విని స్వామి తప్పుగా భావిస్తాడో బయల్దేరి వస్తాడో, నా మీద ఈశ్వరుని అనుగ్రహం ప్రసరిస్తుందో లేదో, ఆర్యా మహాదేవి నన్ను రక్షిస్తుందో లేదో, నా భాగ్యమెలా వుందో’ అని రకరకాల ఆలోచనలు! విప్రుడు వచ్చి అదిగో సుదర్శనాయుధుడు వచ్చేశాడు.. సురాసురులు అడ్డం వచ్చినా సరే వారిని ఎదిరించి నిన్ను రాక్షస వివాహం చేసుకుని తీసుకు వెళ్తాడు.. నీ నడవడి, నీ పుణ్యమూ అన్నీ ఈ రోజు ఫలించాయి అని చెప్పినపుడు నాకు కలిగిన ఆనందాన్ని నేను వర్ణించలేను. వివరించ లేను. “ఈ వార్త చెప్పి నన్ను నిలబెట్టారు, మీ దయతో నన్ను బ్రతికించారు ఏమిచ్చినా మీ ఋణం నేను తీర్చుకోలేను.” అంటూ ఆయనకి భక్తిగా నమస్కరించాను. నిజం... నా జీవితం నిలబెట్టిన ఆ బ్రాహ్మణుడు నిజంగా దైవమే నాకు. ఆయన చెప్తే తెలిసింది నా స్వామి కూడా ఆయనని యెంత గానో ఆదరించాడట. అమేయమైన ధనరాశులు ఇచ్చాడట. అవును, మాధవుడికి బ్రాహ్మణులంటే వున్న గౌరవాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఈ సంఘటనలో నాకు ఆ విషయం మొదటిసారి అర్థమయింది కానీ ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో సార్లు దానిని గ్రహించాను. పిల్లలకి కూడా ఆ విషయాన్ని అవకాశం వచ్చినపుడల్లా బోధించేవారు. ఒక సందర్భంలో పిల్లలందరూ విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి దప్పికయింది. నీటి కోసం వెతుకుతూ ఒక బావి దగ్గరకి వెళ్ళారు. అందులో నీళ్ళు లేవు కానీ ఒక ఊసరవెల్లి వుందట. పిల్లలు దాన్ని చూసి జాలిపడి బావిలో నుంచి బయటకి తీసేందుకు రకరకాలుగా ప్రయత్నించారు కానీ వారికి సాధ్యం కాలేదు. అప్పుడు వారు వెనక్కి వచ్చి గోవిందునితో ఆ విషయం చెప్పారు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఎడమ చేయి జాపి ఆ ఊసరవెల్లిని బయటకి తీశారు. అపుడా ఊసరవెల్లి స్థానంలో ఒక దివ్యరూపుడు కనిపించాడట. ఆయనని నందనందనుడు “అయ్యా నీవెవరు ? ఎందుకిలా ఊసరవెల్లి రూపంలో ఇక్కడ వున్నావు?” అని అడగగానే ఆయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి “దేవా! సర్వవ్యాపకుడివి సర్వసాక్షివి అయిన నీకు తెలియనిది ఏముంది! అయినా నువ్వు చెప్పమని ఆజ్ఞాపించావు కనుక చెప్తాను.” అంటూ తన కథ చెప్పాడు. ఆయన ఇక్ష్వాకుని తనయుడైన నృగ మహారాజు. సాధారణమైన వ్యక్తి కాదు. కోట్లకొలది దానాలు చేశాడు, బావులూ చెరువులూ తవ్వించాడు. లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన ఒక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన గోవు యెలాగో తప్పించుకుని వచ్చి మళ్ళీ ఆయన గోగణంలో కలిసిపోయింది. ఆ విషయం తెలియక ఆయన అదే గోవును మరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. మొదటి బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ వెళ్ళి అది రెండవ బ్రాహ్మణుని ఇంటిలో ఉండడం గమనించి ప్రశ్నించాడు. ఇద్దరూ వివాదపడి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒకరికి దానం చేసిన దానిని మరలా మరొకరికి దానం చేయడమేమిటని ఆయనని నిలదీశారు. ఆయన నివ్వెరపోయాడు. భయపడ్డాడు. తెలిసి చేసిన తప్పు కాదని చెప్పి వారిని వేడుకుని ఆ గోవుకు బదులుగా లక్ష గోవులు ఇస్తాననీ క్షమించమనీ అడిగాడు. అయితే అందుకు ఆ యిద్దరు బ్రాహ్మణులూ ఒప్పుకోలేదు. నిష్టూరాలాడి చిన్నబోయిన మొగాలతో అక్కడినుండి వెళ్ళి పోయారు. అవసానకాలం రాగానే నృగ మహారాజును యమదూతలు వచ్చి తీసుకు వెళ్ళారు. యముడు ఆయనని చూసి నీవు ఎన్నో పుణ్యాలు చేసినప్పటికీ ఈ చిన్న పాపఫలం మిగిలిపోయింది. ఏ ఫలాన్ని ముందు అనుభవిస్తావో నువ్వే నిర్ణయించుకో” అన్నాడు. నృగ మహారాజు పాపఫలాన్నే ముందుగా అనుభవించడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే ఇలా ఊసరవెల్లి రూపంలో అన్నాళ్ళూ ఉన్నాడు. ఆరోజు వాసుదేవుడి స్పర్శతో ఆ పాపం నుంచి విముక్తుడయ్యాడు. ఆ కథ విని పిల్లలు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు మధుసూదనుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణుని పట్ల చూపవలసిన గౌరవమూ భక్తీ ఎలా ఉండాలో వారికి బోధించాడు. బ్రాహ్మణుని సొమ్ము తెలియక తిన్నా నరకగతి కలుగుతుందనీ ఇక తెలిసి తెలిసి ఆ తప్పు చేసినవారినీ వారి పూర్వులనీ పన్నెండు తరాల వరకూ నశింప జేస్తుందనీ చెప్పాడు. విప్రుడు పాపాల నుంచి తనను తాను రక్షించుకోవడమే కాక ఇతరులనీ రక్షిస్తాడనీ అందుకే బ్రాహ్మణుడు ఎక్కడ కనబడినా తాను సాష్టాంగ నమస్కారం చేస్తాననీ చెప్పాడు. అలాగే మరొక సందర్భంలో కూడా విప్ర శబ్దాన్ని స్పష్టంగా నిర్వచించి విప్రులని ఆరాధించడం తనని ఆరాధించడమేనని ఉపదేశించాడు మాధవుడు. అది నిజంగా ఒక అద్భుతమైన కథ! ఒకసారి మిథిలా నగరానికి వెళ్ళాడు మధుసూదనుడు. ఆ సమయంలో మిథిలను బహుళాశ్వుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అక్కడే శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు. ఇద్దరూ కృష్ణభక్తులు. తమతమ విద్యుక్త ధర్మాలను చక్కగా ఆచరిస్తూ వుండేవారు. వారిద్దరినీ అనుగ్రహించ దలచి కేశవుడు అత్రి, వ్యాసుడు, భార్గవరాముడు, కణ్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మొదలైన యెందరో మునులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. శుకమహర్షి కూడా వారితో ఉన్నాడు. మధ్యలో ఎన్నో దేశాలు దాటుతూ అక్కడి ప్రభువుల ఆతిథ్యాలు కానుకలు అందుకుంటూ మిథిల చేరారు. బహుళాశ్వ శ్రుతదేవులు ఇద్దరూ మాధవునికి యెదురు వచ్చి నమస్కరించి మునులందరితోను కలిసి తమ గృహానికి రావాలని ఆహ్వానించారు. అప్పుడు వాసుదేవుడు ఒకే సమయంలో మునులందరితోనూ కలిసి ఇద్దరి ఇళ్ళకీ వెళ్ళాడు! బహుళాశ్వ శ్రుతదేవులిద్దరూ ఆయననీ మునులనీ కూడా భక్తితో పూజించి ఆనందించారు ఒకే సమయంలో!! ఆ సందర్భంలో తనతో వచ్చిన మునిశ్రేష్ఠుల గొప్పదనాన్ని శ్రుతదేవునికి వివరిస్తూ "నా మనస్సులో భూసురుల మీద వున్న ప్రేమ నా చతుర్భుజ రూపం మీద కూడా లేదు." అన్నాడట దేవకీ నందనుడు. వారిని పూజించినపుడు నన్ను పదివేలుగా పూజించినట్లు భావించి సంతోషిస్తాను అన్నాడట. "విశ్వమంతా నా రూపమే అని విశ్వసించి ఎవడు సమవదర్శియై వుంటాడో అతడు విప్రుడు" అంటూ వివరించాడట. ఇలా యెన్నో సందర్భాలలో ఆయన బ్రాహ్మణ భక్తిని గూర్చి పదే పదే చెప్పాడు. చాలా సార్లు ప్రత్యక్షంగా చూశాను, కొన్ని ఇతరుల ద్వారా విన్నాను. నేను కూడా సంతోషంగా బ్రాహ్మణ సేవలో నా భర్తకి సహకరించాను. ఒక్కొక్కసారి మునులు పరీక్షించినపుడు సైతం ఆయన యెంత సహనంతో భక్తితో వారిని సేవించేవారో గమనించి నేనూ అలాగే నడుచుకునేదాన్ని. ఒక సందర్భంలో దుర్వాస మహాముని నన్ను రథానికి అశ్వం వలె కట్టి రథాన్ని లాగమన్నపుడు కూడా నేను నా భర్త అడుగుజాడలలో నడిచి ఆయన అనుగ్రహాన్ని చూరగొన్నాను. ఇంతకీ నా వివాహం విషయం మధ్యలో ఆపాను కదా! చక్రధారి వచ్చాడన్న వార్త వినగానే నాకు కలవరం తీరిపోయి ధైర్యం వచ్చింది కానీ ఆతర్వాత కూడా చాలా కథ జరిగింది. ఆరోజు... నేను పెళ్ళికూతురిగా ముస్తాబై గోవిందుని పాదారవిందాలనే మనసులో స్మరిస్తూ సర్వమంగళా దేవి పూజకు బయల్దేరాను. ఆచారం ప్రకారం ఆలయానికి వెళ్ళి ధూపదీపాలతో పుష్పాలతో అమ్మని అర్చించి వస్త్రాభరణాలు నైవేద్యాలు సమర్పించి మొక్కుకున్నాను. నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్ మిమ్ము బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయుమమ్మ నిన్ నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ! అని ప్రార్ధించి బ్రాహ్మణపత్నులను పూజించి ఆలయం వెలుపలికి వచ్చానో లేదో అమ్మ కరుణ కళ్ళెదురుగా కనిపించింది! చంద్రమండల ముఖుడూ నవాంభోజ దళాక్షుడూ విశాల వక్షస్థలంతో సింహపు నడుముతో బలమైన బాహువులతో ప్రకాశిస్తున్న వాడూ అయిన ఆ నీలమేఘ శరీరుడు పీతాంబరాలు ధరించి జగన్మోహన రూపంతో నాకు కనిపించాడు!! మరుక్షణంలో నేను ఆయన రథంపై వున్నాను! భూమ్యాకాశాలు ప్రతిధ్వనించేటట్లు ఆయన పాంచజన్యం పూరించడం... భయపడుతున్న నావైపు చిరునవ్వుతో చూస్తూ “కమలనయనా! కలవరపడకు!” అని అనునయిస్తూ మరొక పక్కన వెంటబడిన శత్రువులందరినీ సునాయాసంగా జయించడం... అదంతా అబ్బురపడుతూ చూశాను. శత్రువులంటే ఒకరూ ఇద్దరూ కాదు. వాళ్ళ బెడద మాకు అప్పటితో తీరిపోలేదు... జీవితంలో చాలా రోజులు వెన్నాడింది. విలపిస్తున్న శిశుపాలుడిని మధుసూదనుడి చేతిలో ఓటమి ఎటువంటిదో పదిహేడు మార్లు చవిచూసిన అనుభవంతో జరాసంధుడు ఓదార్చాడు. మిగిలిన మిత్రులూ నచ్చచెప్పారు. కానీ నా సోదరుడు రుక్మి! రుక్మి మాత్రం “ఆ యాదవుడిని చంపి నా చెల్లెలిని తీసుకు వస్తాను, లేదంటే కుండినపురంలో అడుగేపెట్టను” అని శపథం చేసి మరీ మా రథాన్ని వెంబడించాడు. ఎన్నో దుర్భాషలాడాడు. ఆ యుద్ధంలో కేశవుడు అతగాడిని సంహరించేవాడే. నేను పాదాలపై వాలి నా సోదరుని విడిచిపెట్టమని ప్రార్థించడంతో ఆగిపోయాడు. చంపలేదు కానీ అతడిని బంధించి గడ్డమూ, మీసాలూ శిరోజాలు ఖండించి విరూపిని చేశాడు. మిగిలిన యాదవవీరులతో కలిసి శత్రుసైన్యాన్ని తరిమేసి మా దగ్గరికి వచ్చిన బలరామదేవులు అది చూసి నొచ్చుకున్నారు. నా సోదరుని కట్లు విప్పి “ఎంతయినా రుక్మిణికి సోదరుడు కదా! బంధువు పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదు” అంటూ అచ్యుతుని చర్యని ఆక్షేపించి “అమ్మా, ఇలా జరిగిందని మామీద కోపం పెట్టుకోకు” అంటూ నన్ను అనునయించారు. ఆయన వాత్సల్యంగా మాట్లాడిన మాటలతో నా విచారం మాయమయిపోయింది. ఆ తర్వాత ద్వారకలో మా వివాహం వైభవంగా జరిగింది. రుక్మి తాను చేసిన శపథం ప్రకారం తిరిగి కుండిన నగరంలో ప్రవేశించకుండా భోజకటకమనే నగరాన్ని నిర్మించుకుని అక్కడ ఉండిపోయాడు. చిత్రమేమిటంటే ఆరోజు నా సోదరుని బంధించి అవమానించినపుడు జాలిపడిన బలరాములవారే తర్వాతికాలంలో అతనిని వధించారు. అదీ వివాహసమయంలోనే! నా పౌత్రుని వివాహసమయంలో! వివాహమైన కొంతకాలానికి నాకు ప్రద్యుమ్నుడు అనే కొడుకు పుట్టాడు. అతడు ఒకప్పుడు ముక్కంటి కంటి మంటకు భస్మమయిన మన్మధుడేనట. అయితే అతడు పుట్టినపుడు మళ్ళీ నాస్వామి చిన్ననాటి కథే పునరావృతమయింది. శంబరాసురుడనే రాక్షసుడికి శ్రీకృష్ణసుతుని వలన మరణం వుందని యెవరో చెప్పారట. అతగాడు భయపడి అచ్చం కంసుడి వలెనే నాబిడ్డని పురిట్లోనే చంపేయాలనుకున్నాడు. పసికందును అపహరించి సముద్రంలోకి విసిరేశాడు. అప్పుడు బిడ్డను ఒక చేప మింగడం.. ఆ చేప ఒక జాలరికి చిక్కగా అతడు దానిని తీసుకు వెళ్ళి శంబరాసురునికే కానుకగా ఇవ్వడం జరిగింది. దానిని శంబరుని వంటవాడు కోసి చూడగా పిల్లవాడు కనిపించాడు. మన్మధుని పత్ని అయిన రతీదేవికి నారదుడు విషయమంతా వివరించడం వలన ఆమెకి ఆ పసివాడు మన్మధుడని తెలుసు. అందుకే ఆమె శంబరుని నివాసంలో మాయావతి అన్న పేరుతో మెలగుతూ ఆ బిడ్డని వంటవారి దగ్గర నుండి తీసుకుని శంబరుని అనుమతితో పెంచుకుంది. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక ఆమె సిగ్గుతో చిరునవ్వుతో తనని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం చూసి ఆశ్చర్యపోయి ఆమెని ప్రశ్నించినపుడు ఆమె కథ అంతా వివరించింది. నిజం తెలుసుకున్నాక ప్రద్యుమ్నుడు శంబరాసురుని ఎదిరించి యుద్ధం చేసి వాడిని సంహరించి రతీదేవితో కలిసి గగనమార్గాన ద్వారకకి వచ్చాడు. అచ్చం నాస్వామి పోలికలతో వున్న అతడిని చూసి నేను ఆశ్చర్యానందాలలో మునిగిపోగా అప్పుడు మళ్ళీ నారదులవారు వచ్చి జరిగినదంతా తెలియచేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రద్యుమ్నుని వివాహం నా సోదరుడు రుక్మి కుమార్తె అయిన రుక్మవతితో జరిగింది. నా వివాహసమయంలో తనకి జరిగిన అవమానానికి తన మనసులో క్రోధం వున్నా నా మీద వున్న అభిమానంతో నా అన్న తన కుమార్తెకు నా కొడుకుతో వివాహం జరిపించాడు. అవును నా మీద అతనికి అభిమానం లేకపోలేదు. నా వివాహసమయంలో అడ్డుపడడానికి కూడా ఆ అభిమానమే కారణం. నా స్వామి విలువ గ్రహించలేక ఒక గొల్లవాడికి ఇంత అపురూపమైన నా సోదరిని ఇవ్వడమేమిటని భావించాడు. అందుకే అంత పట్టు పట్టాడు. కొన్నాళ్ళకి ప్రద్యుమ్నునికీ రుక్మవతికీ కూడా ఒక కుమారుడు కలిగాడు. అనిరుద్ధుడు. అతడు పెద్దవాడయ్యాక మళ్ళీ అతనికీ రుక్మి పౌత్రి అయిన రోచనకీ వివాహం జరిపించాలని అనుకున్నాం. అందరం భోజకటకపురానికి తరలి వెళ్ళాం. వివాహం చక్కగా జరిగింది. ఆ తర్వాత కాళింగుడి వంటి కొందరు రాజులు రెచ్చగొట్టగా నా అన్న రుక్మి బలరాముల వారిని జూదానికి ఆహ్వానించాడు. అతడికి అక్ష విద్య తెలియకపోయినా స్నేహితుల మాటలు విని ఆ పని చేశాడు. ఆట మొదలయ్యాక మొదట ఒకసారి రుక్మి గెలిచినపుడు అందరూ బలరామదేవుని చూసి పరిహాసంగా నవ్వారు. ఆతర్వాత వరుసగా ఆయన గెలవడం ప్రారంభం కాగానే అసలు అది గెలుపే కాదనీ గెలుపు తమదేననీ గొడవ చేశారు. అపుడు గగనభాగం నుంచి ఆకాశవాణి “బలరాముడిదే నిజమైన గెలుపు” అని ప్రకటించింది. అయినా కూడా లెక్క చేయకుండా వారు దుర్భాషలకు దిగారు. “గోవుల కాపరులకి అక్ష విద్య ఎలా తెలుస్తుంది? అడవులలో తిరిగేవారికి నాగరిక విద్యలు ఎలా వస్తాయి?” వంటి మాటలు! అందరూ కలిసి పరిహాసాలు!! దానితో ఆగ్రహించిన హలాయుధుని చేతిలో రుక్మి మరణించాడు. అతనిని రెచ్చగొట్టిన స్నేహితులలో కొందరు మరణించారు. కొందరు పారిపోయారు. అప్పటికి ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న శ్రీకృష్ణ దేవులు ఆ తర్వాత నన్ను పరీక్షించారు. ఇన్నాళ్ళ తర్వాత... చెల్లెలిని, కూతురిని, మనవరాలిని ఈ వంశానికి ఇచ్చిన తర్వాత కూడా నా సోదరునికి యాదవుల పట్ల అల్పులనే భావం పోలేదు. వీరిని ఇన్నాళ్ళుగా చూస్తున్నా బంధుత్వం నెరపుతున్నా కూడా వీరి విలువ అతనికి అర్థం కాలేదు. మరి నాకు... అక్కడే ఆ యింట్లోనే పుట్టిన నాకు స్వామిని కనీసం కళ్ళతో చూడనైనా చూడక ముందే ఆయన పురుషోత్తముడని ఎలా తెలిసింది! ఇన్నాళ్ళుగా ఆ అభిప్రాయం అచంచలంగా యెలా వుంది? ఆ విషయాలని నా నోటితోనే స్వయంగా చెప్పించదలిచాడు మాధవుడు. నా మందిరానికి వచ్చి “కులం, గుణం, రూపం – వేటిలోనూ నేను నీకు తగినవాడిని కాను. రాజ్యార్హత లేదు. మరి ఏమి చూసి నీ అగ్రజుడు కాదంటున్నా కూడా నన్ను వరించావు!” అని అడిగాడు. అంతేకాదు, నా బంధువులూ నా అన్న స్నేహితులూ ఆయన శత్రువులూ పదేపదే ప్రయోగించే పలు నిందావాక్యాలని “శౌర్యం లేదు... లోకాచారాలు తెలియవు... పారిపోయి సముద్రంలో దాగాడు... మాయావి” వంటివి గుర్తు చేసి “అవన్నీ నిజమే కదా!” అని నిష్టూరంగా మాట్లాడాడు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇన్నాళ్ళలో ఎప్పుడూ ఒక్కసారి కూడా ఆయన అలా అప్రియంగా మాట్లాడలేదు. అందుకే నాకు ఒకింత గర్వంగా కూడా వుండేది. పట్టమహిషిని, ఆయనకి యిష్టమైన భార్యని అని. ఎప్పుడూ నాతో ప్రశంసగా ప్రసన్నంగా మాట్లాడే ఆయన ఆరోజు అన్ని మాటలు అలా దెప్పిపొడిచినట్లుగా అంటుంటే భరించలేక పోయాను. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. అపుడు ఆయనే మళ్ళీ నాకు సపర్యలు చేసి నన్ను సేద తీర్చి అవన్నీ నిజంగా అన్నమాటలు కావనీ పరిహాసోక్తులు అనీ వివరించారు. నేను తెప్పరిల్లి గుణాతీతమూ అద్వితీయమూ అయిన ఆయన తత్త్వాన్ని నేను గ్రహించిన విధంగా సంతోషంగా కీర్తించాను. ఎవరి పాదసేవకులు సైతం రాజ్యాధికారాలను తృణప్రాయంగా చూస్తారో ఆ జగన్నాథుడికి రాజ్యాలతో పని లేదన్న విషయాన్ని విప్పిచెప్పాను. నా వివేకానికి ఆయన సంతోషించి ప్రశంసించారు. ఆ ఘట్టం అలా ఆనందంగా ముగిసింది కానీ చెప్పాను కదా! మా వివాహం నాటి అపార్థాలు, శత్రుత్వాలు మా జీవితంలో చాలాకాలం కొనసాగాయి. నిరంతరమూ శ్రీకృష్ణరూపాన్ని అనుకరిస్తూ చక్రమూ కౌస్తుభమూ వంటి చిహ్నాలను ధరిస్తూ ‘నేనే నిజమైన వాసుదేవుడిని’ అంటూ వుండే కరూశ దేశాధిపతి పౌండ్రకుడు తన స్నేహితుడైన కాశీ రాజుతో కలిసి యుద్ధానికి దిగాడు! అపుడు వారిద్దరినీ జనార్ధనుని చక్రాయుధం సంహరించింది. అసూయతోనే అయినా నిరంతరం శ్రీకృష్ణ రూపాన్ని ధ్యానించాడు కనుక పౌండ్రకుడు మోక్షాన్ని పొందాడు. కాశీరాజుమృతికి ప్రతీకారంగా అతని పుత్రుడు సుదక్షిణుడనే వాడు మహేశ్వరుని ప్రార్థించి ఆయన సూచన మేరకు ఋత్విజులను రావించి ఒక అభిచార హోమం చేశాడు. అందులో నుండి పుట్టిన కృత్య అనే శక్తి ద్వారకని దావాగ్నిలా చుట్టుముట్టింది. అపుడు మళ్ళీ మాధవుడు ప్రయోగించిన చక్రాయుధం ఆ అగ్నిని చల్లార్చి కాశీకి వెళ్ళి అక్కడి గోపురాలనీ ప్రాకారాలనీ యజ్ఞవేదికను ఋత్విజులను సుదక్షిణుడినీ అందరినీ దగ్ధం చేసి వెనక్కి వచ్చింది. అలాగే నా వివాహ సమయంలో పారిపోయిన శిశుపాలుని మరొక మిత్రుడు సాళ్వుడు పగబట్టి యాదవకులాన్ని మొత్తాన్నీ నిర్ములిస్తానని శపథం చేసి శివుని గూర్చి తపస్సు చేశాడు. గౌరీపతి ప్రత్యక్షమవగానే సాళ్వుడు దేవదానవ గంధర్వాదులకు లొంగనిదీ కామగమనం కలిగినదీ అయిన విమానం కావాలని అడిగాడు. పరమేశ్వరుని ఆజ్ఞతో విశ్వకర్మ సౌభకమనే విమానాన్ని తయారు చేసి ఇచ్చాడు. శ్రీకృష్ణులు ద్వారకలో లేని సమయం చూసి సాళ్వుడు ఆ విమానం పై వచ్చి ద్వారకానగరాన్ని మొత్తాన్నీ గగ్గోలు పరిచాడు. జనులందరూ భయభ్రాంతులయ్యారు. అయితే అపుడు ప్రద్యుమ్నుడు తన సోదరులతో, సాత్యకి వంటి యదువీరులతో కలిసి సాళ్వుడిని ఎదుర్కొన్నాడు. సాళ్వుని మంత్రి ద్యుమంతునితో జరిగిన భీకర యుద్ధంలో అతనిని సంహరించాడు. అంతలో పాండవుల వద్దకు వెళ్ళిన కేశవుడు తిరిగి వచ్చాడు. సాళ్వుని మాయవిమానాన్ని నిర్వీర్యం చేసి చక్రాయుధంతో అతడిని సంహరించాడు. ఆ తర్వాత వీళ్ళకి మరొక మిత్రుడైన దంతవక్త్రుడు వాసుదేవుడికి మేనత్త కొడుకే అయినప్పటికీ ఆ బంధుత్వాన్ని లెక్క చేయకుండా యుద్ధానికి వచ్చాడు. కేశవుడు అతగాడిని తన కౌమోదకితో సంహరించాడు. ఆ సమయంలో అతని నుండి ఒక దివ్యజ్యోతి వచ్చి హరిలో లీనమయ్యింది! అటు పిమ్మట దంతవక్త్రుని తమ్ముడు విదూరథుడు యుద్ధానికి రాగా అతనినీ జనార్ధనుడు చక్రాయుధంతో సంహరించాడు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు... ఎందఱో శత్రువులు! ఏళ్ళ తరబడి సాగిన పగలు! నా వివాహం నాడు మొదలై నా మనవల వివాహం వరకూ కూడా సాగిన వైరాలు! వ్రేపల్లెలో చిన్ననాడు నా స్వామి చవిచూసిన స్నేహమూ ప్రేమా యెంత అపురూపమయినవో యెంత గాఢమయినవో కథలుగా వినడమే కానీ నేను చూడలేదు. ఆ తర్వాత ఆయన మథురకు వచ్చినప్పటి నుండీ మాత్రం వరుసగా శత్రుత్వాలే ఏర్పడడం కనిపిస్తోంది. అక్కడ ఆయనని అవ్యాజంగా ప్రేమించని వారు ఒక్కరూ వుండేవారు కాదట! ఇక్కడ ఆయనని అకారణంగా ద్వేషించని వారు ఎవరూ లేరు. అర్జునునితో వున్న గాఢస్నేహం... ఆ మాధుర్యం ఒక్కటి మాత్రమే నాకు తెలిసినది. అది కాకుండా మరొక్క సంఘటన... ఆయన బాల్యసఖుడు సుదాముడు మా మందిరానికి వచ్చిన సంఘటన! అదొక అపురూపమయిన సన్నివేశం! అతడికి స్వామిపై ఎంతటి ప్రేమ! ఆ ప్రేమని చూడటమే ఎంతో ఆనందాన్ని కలిగించింది. అతడు ధర్మపరుడు, జితేంద్రియుడు, బ్రహ్మవేత్త కానీ దుర్భర దారిద్ర్యంలో బ్రతుకుతూ ఉండేవాడు. చినిగిన వస్త్రాలు ధరించి తిరుగుతూ అందరితో కుచేలుడని పిలువబడేవాడు. శరణాగతవత్సలుడైన శ్రీకృష్ణుని సహాయం కోరమన్న అతని భార్య సలహాని స్వీకరించి ఒకనాడు అతడు కృష్ణదర్శనానికి వచ్చాడు. ఉట్టి చేతులతో రాలేక, భార్య ఇరుగుపొరుగు విప్రపత్నులను అడిగి తెచ్చిన నాలుగు గుప్పిళ్ళ అటుకులను చినిగి వేలాడుతున్న తన వస్త్రంలో మూటగట్టుకుని తెచ్చాడు. అతడు సిగ్గుపడుతూ బిడియంగా మా మందిరం వద్దకు రాగానే దూరం నుంచే అతడిని గుర్తించిన మాధవుడు వడివడిగా అతడికి ఎదురు వెళ్ళి ఆప్యాయంగా కౌగలించుకుని కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలుతుండగా అతని చేతులు పట్టుకుని లోపలికి తీసుకు వచ్చాడు. తానే స్వయంగా పూజాద్రవ్యాలు తెచ్చి ఒక బ్రాహ్మణుని పూజించవలసిన విధంగా పూజించాడు. నేను కూడా చామరాన్ని చేతబట్టుకుని వీస్తూ నా నాథుడు తన మిత్రునికి చేస్తున్న సేవలో సహకరించాను. చిన్ననాటి ముచ్చట్లను స్నేహితునితో ఎంతో సేపు ఆనందంగా పంచుకున్న జనార్ధనుడు మాటల మధ్యలో కుచేలుడు కొంగుకు కట్టుకు వచ్చిన మూటను గమనించి “ఏమిటిది! నాకేమైనా కానుక తెచ్చావా!” అని అడిగాడు. అతడు మొహమాటంగా దానిని దాచుకుంటున్నప్పటికీ బలవంతంగా విప్పి చూసి ఆ అటుకులని పరమానందంగా పిడికిలితో తీసుకుని భుజించాడు. నాకు అర్థమయింది జగన్నాథుడిని తృప్తి పరచిన ఆ గుప్పెడు అటుకులూ ఆక్షణమే కుచేలుని ఇహపరాలకు సంబంధించిన సకల సంపదల్నీ సమకూర్చాయని. అందుకే స్వామి మరొక పిడికెడు అటుకులు అందుకోబోతుంటే ఆపేశాను. నోరు తెరిచి ఏమీ అడగకుండానే, కేవలం అతిథి మర్యాదలు మాత్రం స్వీకరించి కుచేలుడు వెళ్ళిపోయాడు. అతనికి కృష్ణదర్శనం యెంతటి ఆనందాన్ని కలిగించిందో కనులారా చూసి నేను చాలా సంతోషించాను. ఆతర్వాత అతడు తన ఇంటికి చేరి, ఆసరికి అక్కడ అమరి వున్న సంపదలనీ వైభోగాన్నీ చూసి, అడగకముందే అన్నీ యిచ్చే మాధవుడి కరుణని తల్చుకుని తల్చుకుని మురిసి పోవడాన్నీ కళ్ళు చెదిరే ఆ సంపదల మాయలో పడిపోకుండా స్వామి స్మరణతోనే మిగిలిన జీవితాన్ని గడపడాన్ని మనసుతో గ్రహించాను. నా సోదరునితో మొదలుపెట్టి ఎందఱో రాజులు ఆయనపై కురిపించిన ద్వేషాన్నే పదేపదే చూసిన నాకళ్ళకి ఇన్నాళ్ళకి కుచేలుడు చూపించిన ఈ ఆప్యాయత యెంతో అపురూపంగా అనిపించింది. కానీ నా స్వామి ఈ భూమి మీదకు దిగివచ్చినదే భూభారం తగ్గించడానికి కదా! ఆయన ఆయుధం పట్టకుండా నడిపించిన కురుపాండవ యుద్ధాన్ని పక్కన పెడితే ఆయన స్వయంగా చేసిన యుద్ధాలన్నీ దాదాపుగా నావలన మొదలయినవే. ఆ శత్రుత్వాలన్నీ నన్ను చేపట్టడం వలన ఏర్పడినవే! కనుక ఆయన అవతారకార్యంలో నాపాత్రా గణనీయమే! అదే ఆయన భార్యలందరిలోను ఆమాటకొస్తే అసలు కృష్ణావతారంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులందరిలోను నన్ను ప్రత్యేకంగా నిలబెట్టే విషయం! ఆయన నా మనసును దోచుకున్నవాడు మాత్రమే కాదు తన జీవితంలో అర్ధభాగాన్ని నాకు ధారపోసిన వాడు కూడా అని అర్థం చేసే అంశం. |