కథలు »
   
 
" ఇక్కడ పచ్చళ్ళ సీసాలు పెట్టానే ఏవైనాయి?" రాగవడిగె.                                                                                                                                            

 "యావో న్నాయ్న!మూడ్దినాలముందీ డ్నే ఉండె! యావయ్యినయ్యో!"అంట ఆగదిలోఉండేటి అర్లన్నీ ఎతికితి.దొరికినై గాదు. మారాగవకి సిన్నప్పటాల్నుంచీ పచ్చల్లంటే పేనం. 

"యాంది రబ్బయ్యా!యావైపోయినైరా!"అంటి. 

  "రాణీ! ఇక్కడున్న పచ్చళ్ళ సీసాలేమైనై ?నీవే మన్నా తీశావా?"అంటా రాగవ పెల్లాన్నడిగె .                                                                                                    

 "ఏం ఆ లం..ముం...కు పచ్చల్లు లేంది ముద్దదిగదా!" అంటా కోపంగ రానొచ్చె.                                                                                       

  "ఏం వాగుతున్నా వ్! మా అమ్మ లం..ముం..ఐతే నేనెవర్ని? నన్ను పెళ్ళాడిన నీవెవర్తెవే!?"అని రాగవ కోపంగానె.                                            

"ఛీఛీ ఈ చదువు సంస్కారంలేని పల్లెకంపు ముం ...ను ఇంట్లో చూస్తుంటే నాకసహ్యవేస్తున్నది " అంటా నంజీదరించె.                                                                                                                              

" నోరుజాగ్రత్త! మాఅమ్మనింకోమాటన్నావంటే..."అమిత కోపంగ రాగవ కల్లు ఎరుపెక్కె.                                                                   

  "అంటే ఏం ?ఏంచేస్తావు?ఈ లం.ముం. కొంపలో ఉంటే నాపిల్లల్న తీసుకుని నేను ఇంట్లోంచీ  వెళ్ళిపోతాను,దాన్ని పంపించే య్!“అంటా మగడన్న బయ్యం గూడలేకాండ రాని రాగవ పైపైకొచ్చె.  నేను అడ్డం పోయ్యేలోంగనే  రాగవ, రాని సెంపలు పటా పటాయించె.   
                                                                                                                                 " నీ అమ్మగార్ని నేనా మాటలంటే ఏమవుతుంది? నన్ను కన్న మా అమ్మను ఆ మాటలతో తిడతావా?డర్టీ క్రీచర్!” అంటూ రాగవ వుగురుడాయె ! రాని తగ్గదాయె!                                                                            

"కష్టపడిసంపాదిస్తున్న సొమ్మంతా దీని చిన్నకొడుకు పిల్లలకు ఇస్తున్నావ్!ఆయధవలకు చదువు కావాల్సొచ్చిందా ! పాడు మూక , అసలు వాళ్ళు ఎవరికి పుట్టిన బిడ్డలు?నీకా? నీతమ్మునికా   --" అంటా అంతంత లాసి పాప్పు మాట్లనె.                                                                                        

 " నీ పాపం కూలా ! నోర్ముయ్! చదువులేని వాళ్ళు కూడ ఇంత వెధవ మాటలనరు.” అంటా నాకాడికొచ్చి, ” అమ్మా!నేను ఆఫీసు కెళ్తున్నా. సాయంత్రం , నిన్ను తీసుకెళ్ళి  మీ అన్న కొడుకింట్లోదింపేస్తా. నీ చీరలన్నీ సంచీలోపెట్టుకుని తయారుగా ఉండు.ఇది మనుషులుండే తావు కాదమ్మ!. "అంటా ఉత్తి కడుపుతా రాగవ  ఆపీంస్కు కార్మీదెల్లె.

నా తల్లి కడుపుసూరుమనె. ఇల్లన్నాంక  తగాయిదాలుంటై. ఇట్టా అత్తల్ని ముం...అనంటా దిట్టడ వెక్కడా మా ఇల్లల్ల జూడ్నైతి .సదూకున్న వాల్లిట్టామాట్టాడ్తరని నాకు తెలవదు. మా రాగవ కారెక్కి ల్లి పోయినాంక "బయటికి పోవే లం..ముం . .నీ వొచ్చిన దగ్గర్నుంచీ ఎప్పుడూలేంది మా ఇంట్లో రచ్చల వుతున్నై. " అంటా నా సీర లున్న సంచీ ఓ సేత్తా, నాజుత్తుముడి ఓసేత్తా పట్టి లాక్కెల్లి ఈధి గేటు దెర్సి , నందోసేసి, సంచీ నాముకానేసి, ”మళ్ళావ చ్చావంటే మర్యాదగా ఉండదు. పోయి చావు ఎక్కడైనా “ అంటా గేటేసుకెల్లిపోయ  రాని. ‘నా కొడుకు రాగవ పెల్లవా యిది ! నాకోడ్ల!!  ఇంతింటమాట్లని నన్నిట్టదోసద్దా! తమ్ముల్లాంటి మరిద్ని, సెల్లెలట్టంటి తోటికోడల్ని ఇంత నీసంగంటద!  ‘ అని మనస్సు లాగె. గుండెజారె.   

నాకా ఊర్కొత్త ,నాపల్లొదిలి పదిరోజుల్నాడొస్తి, వొచ్చినకాడ్నుంసీ ఈపె కిదేదరువయ్యె. యానాడూ బస్సెక్కిందాన్నిగూడగాను .సంచిసంక నెట్కుని ఎదారంగున్న పారుక్కులో మూల్నున్న బెంచీ మ్మీంద గూర్సుంటి , నేకాన్రాకండ దుబ్బులడ్డం గుంతావున గూకుంటి. నా కడుపుల్ల నకనకలాడ తాండె. రేత్తిరిగూడ ‘సనోర’వని పస్తుంటి. దేవునికాడ దీపవెట్టి మా రాగవ కిట్టవని బియ్యన్నూక లుప్మ జేత్తి. నేగాసిన పప్పు సారంటా రాగవకు చెడ్డిట్టం. పచ్చల్ల కోసవెతకతాన్న రాగవ, ఈతగాయి దైనాంక యావీతినకండా అట్నెల్లిపాయ.                                                                                                                                

నాకు సదూంరాదు. మాది సీతమ్మోరిపల్లి. మాపల్లెకాడ ఏరు పారద్ది,ఏడాది పొడుక్కూ సెరువుల నీల్లె. నాపెనివిటి బల్రావయ్య పేరుకే గాంక మడిసీ బలంగుంటడు, సేయెత్తుమడిసి. కర్రట్టక నడత్తాంటే అంతా పక్కలపక్కల కెల్తాంటరు. పదోయాట్నే పెల్లై ,ఈడేరినాంక మా ఆయినెనికొచ్చి ,ఇంట్లా అడుగెడ్తి, ముగ్గురు కొడుకుల తల్లయితి ,అత్తామావల్ని నాపిల్లోల్లతోపాటుగ్గా సాకి సంతరిత్తి. ముగ్గురాడ బిడ్డల్కూ ,మరుదుల్కూ పెల్లిల్లూ, పేరంటకాలూ , తమ్ముల్లరీతి జేత్తి. మాపల్లిలో ‘సీతమ్మ మంచి మన సున్నదని ‘  పేర్దెచ్చుకుంటి. సదివేదీ రాసేదీ తెలీకాంటిగానీ నాపిల్లల్ను సదివింసాల్ని కోరుకాంటి. అందరి పెల్లిల్లకూ పాతికెక రాలపొలం పదైగూరుసాండె. నాకూ ఒక్క ఆడబిడ్డ నివ్వలేదేని బాదగాండె గానీ, ఆపెకు ఈ సమయాల్ల పెల్లి సక్కరంగ సేద్దునో లేదోనుకుంటి. మాయన్న కొడ్కులు పట్నాల్ల జదివి పెద్ద పెద్ద నౌకరీల్ల ఉంట్రి. ఆల్లోమారు నంజూడొస్తిరి .   " సీతత్తా! నీకెటూ చదువులేదు, నీకొడుకుల్నైనా చదవెయ్యకూడదా! " అంజె ప్పిన మాటలు నామదిలనాటె.అంద్కని పెద్దోన్నీ సిన్నోన్నీ మా బల్రావయ్యకు నజ్జెప్పి , నజ్జెప్పి మాయన్నకాడుంచి పట్నంల జదవేస్తి. ఆల్లసదూంలకు పొలం ఐదెకరాలయ్య. మూడోడి సదూ కుంటయ్యె . పదకొండోకలాసుకెల్లే తలికి  పైవోల్లు వింజెనీయరు, డాకటేర్ల వుతాంట్రి.   
                                                                                                                                                      "అమ్మా! అన్నల చదువులైనాక నేను చదువుకుంటానులే! నాయనకి పొలంకాడ సాయంచేస్తుంటాను అందాకా ” అని మూడో వోడు ముర్లి నాగ లట్టుకెల్లె. "ఒరే రాగవా! వామనా!తమ్ముని సదూమీ సేతల్లాండాదిర! ఆడు కర్సుకు బయ్యవై మాకా డంత సొమ్ముల్లేవని మీ సదూలయ్యేం తొరుకూ పొలంకాడ నాయ్నత పనిజేత్తన్నడు. " అంటి.                                             

"ఓస్ ! దాందేముందమ్మా! మరో రెండేళ్ళకి మేం ఉద్యోగాల్లోచేరుతాం.తమ్ముడ్ని ఆడు కోరుకున్న చదువు చదివిస్తాం" అని మాటి చ్చుంట్రి . పెద్దోడు వింజనీరయ్యేతలికి రెండోవోడు డాకటరై పైసదూంలకని అమేరికెల్లె. ఆడికోసం ఇంకోఎకరం చేజారె. ఆడుఆడ్నే ఆడుండా పిల్లను పెల్లాడె. మాపెవేయవాం లేదయ్యె! అమేరికెల్లి నోడ్ని కంట సూడవైతివి, ఈనగాచిన వనూర్కుంటివి. రాగవ వింజ నీరయ్యి ఉజ్జోగాల్ల తిరగ తాండె. తమ్మున్ని, ఆడిసదూనూ మరిసె. ఆయేల్టికి ముర్లిరైతైపోయె,నాయ్నికి ఆసరగుండె. పొలాంల బంగారం పండిత్తాండె. పొరుగూరి గురునాదం తన కూతుర్నిస్తననొచ్చె.                                                                                                                                                            

"ముర్లీ! సదూంకోవాఏందిర! రాగవ నిన్ను సదివిత్తా నన్లేదుర!"అంటి,దాంకి ముర్లి "అమ్మా! నాయన పెద్దోడై పోయిండు గదా! పొల మె వరుజూస్తారు? నా బ్రతుకు ’ భూదేవమ్మసేవ’కె పోనీయమ్మా!, ఆ గుర్నాధం  తన కూతురు కమలనునాకిచ్చి చేస్తానని కబురం పాడుగదా! ఆపెళ్ళి ఖాయం చేసేయమ్మా! కాస్తంత విశ్రాంతిగా ఉండు, ఇంకెన్నాళ్ళు పోయ్యూత్తూ వంటచే స్తావ్? పల్లెపిల్ల ఇంత వండి పెడతుంది, మిమ్మల్ని చూసుకుంటుంది" అనేతలికి పెల్లికుదిరిత్తి. రాగవ సెలవుఎట్టొచ్చె ,గానీ రెండో వోడి ఊసేలేదాయె . "అన్నక్కాకండ తమ్ముని పెల్లెట్టాజేత్తం,నీవూ సేసేసుకోరాదుర  రాగవా!!"అనేలికి ,“ అమ్మా! ముందు తమ్ముని పెళ్ళిగానీ, నీకు కాస్తంత చేతికింద ఉంటుందనే కదా తమ్ముడుచెప్పాడు, అట్టాగేగానీ, ముందుతమ్ముళ్ళ పెళ్ళుళ్ళూఆపైన నాపెళ్ళి" అనేల్కి ముర్లికీ  పెల్లిజేసేత్తివి. కవల బంగారబ్బొమ్మ , పెల్లైన కాడ్నుంసీ ,’ అత్తమ్మత్తమ్మాంటా ‘నాకు పొయ్యి కాడి కెల్లేపన్లే కండ ఇస్రాంతిచ్చె.ముర్లి మనస్సు ఆయిగుండె.                                                                                          

ముర్లి “ నాయనా! ఇంక పొలం కాడికిరామాక  “అని ఆయన్ని సలగా లడగడవే గానీ పొలంకాడికి రానీపోయె. రెండెక రాల పొలాన్ని పదెక రాల్జేసె ముర్లి. ఆడికి ఓ మగపిల్గాడు, ఆపైనో ఆడగూతురు గలిగె.                                                                 

సశేషం....
   
Untitled Document