కథలు »
   
 
‘‘అందరూ జాగ్రత్తగా వినండి. రేపటి వారం నుండి పెద్ద పరీక్షలు ప్రారంభమౌతున్నాయి. సంవత్సరమంతా కష్ట పడ్డాం, ఇక ఫైనల్ పరీక్షలు బాగా వ్రాయాలి. ఎవరూ పరీక్షలకు ఆబ్సెంట్ కాకూడదు. ఎవరైనా పరీక్షలు రాయకపోతే వారిని ఎట్టి పరిస్థితుల లోనూ పై క్లాసుకు ప్రమోట్ చేయను. హెచ్.ఎం. మేడం కు చెప్పి ఫెయిల్ చేయిస్తాను, ఈ రోజు బడికి రాని పెద్ద మనుషులందరికీ కూడా చెప్పండి. బాగా అర్ధంమైందా ..?’’అంటూ అరువు తెచ్చుకున్న కాఠిన్యంతో గట్టి స్వరం తోనే చెప్పాను అప్పుడే ప్రార్ధన ముగించుకొని వచ్చిన ఆరవ తరగతి పిల్లలను ఉద్దేశించి. విస్తుపోతూ నా ముఖం కేసి చూశారు పిల్లలు. సార్ దగ్గర ఎపుడూ లేని అధికార స్వరం ఎందుకు వస్తోంది ఈ రోజు.. ఎప్పుడూ ఎంతో ప్రేమగా పలకరించే మన సార్, ఈ రోజు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాడు?! అని పిల్లలలో కొంత టెన్షన్. అయినా జవాబు చెప్పాలి కాబట్టి అందరూ ఒకే సారి, ‘‘సరే సార్’’ అంటూ ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు.

‘‘అవున్రా.. ప్రతి రోజూ తప్పకుండా వచ్చే ప్రకాష్ ఈ రోజు కనపడలేదు ఎందుకు?’’ అనడిగాను ముందు వరసలో కుర్చునే షరీఫ్ ను. ‘సార్ ప్రకాష్ వాళ్ళమ్మ కు నిన్న ఆరోగ్యం బాగలేక పోతే, అనంతపురానికి తీసుకుపోయారు సార్. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే కద సార్. నిన్న రాత్రి వాళ్ళ నాయన వెంట వాడు కూడా పోయినాడేమో సార్’’ అన్నాడు షరీఫ్.
‘‘ఏమైందిరా ఆమెకు?’’ అనడిగాను.
‘‘ఫుల్లుగా జరమొస్తాండె సార్. మద్ద్యానం నుండి వాంతులు కూడా అయినాయంట సార్’’ అన్నాడు షరీఫ్.
అంతటితో ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి, ‘‘ఆఁ... ఇంక పరీక్షకు చదవడం మొదలు పెట్టండి. పుస్తకాలను తీయండి’’ అంటూ పిల్లలను చదువుకు పురమాయించాను.
పిల్లలందరూ ఒక్కసారి గా గట్టిగా చదవడం మొదలు పెట్టారు.
‘‘సార్... ఒక వేళ మాకు ఆరోగ్యం బాగాలేక పోతే పరీక్షకు రాకపోయినా పర్వాలేదా సార్?’’ కొంచెం భయంగా నా కళ్ళ లోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ అడిగింది ముందు వరసలోని అమ్మాయి భవాని. అసందర్భ ప్రేలాపనలా విన్పించిన ఆ మాటలకు కొంచెం కోపం నటిస్తూ, ‘పరీక్షలకు తప్పనిసరి గా రావాలని నేను చెప్పాను కదా! అయినా మీరింకా చిన్న పిల్లలు. ఈ వయసులో ఏమి సమస్యలు ఉంటాయమ్మా? ఊరకే విసిగించక, చెప్పినట్లు వినేది నేర్చుకోండి’’ కాస్త విసురుగానే వచ్చింది మాట నా నోటి వెంట. మరింకేమి బదులు చెప్పకుండా ప్రశ్న – జవాబులు నేర్చుకోవడం లో నిమగ్నమయ్యారు పిల్లలు. మధ్య మధ్యలో నాకేసి పిల్లలు చూడటం నేను గమనించి, కనీసం ఇప్పుడైనా చదువు పట్ల శ్రద్ధను కనపరుస్తున్న పిల్లలను మనసు లోనే అభినందించాను. అమాయకులైన ఈ పిల్లలకు చక్కటి భవిష్యత్తును ఇవ్వమని ఆ దైవాన్ని వేడుకున్నాను ఆ క్షణం లో.
‘‘ఠంగ్ - - ఠంగ్ - -’’మని బడి గంట, బడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గంట రెండూ ఒకేసారి మ్రోగాయి.
-*-*-
 
‘‘సార్, ఈ సంవత్సరం పెద్ద పరీక్షల నిర్వహణ భాధ్యత మీదే. పరీక్షలు సక్రమంగా నిర్వహించడమే కాదు, పిల్లలందరూ హాజరయ్యేటట్లు చూడటం కూడా చాలా ముఖ్యం’’ వర్క్ అలాట్ మెంట్ రిజిస్టర్ లో సంతకం చేయించుకుంటూ సున్నితంగానే ఆదేశాలు జారీ చేశారు హెచ్.ఎం. మేడమ్.  

‘‘సరే మేడమ్.. ఇది వరకే పిల్లలందరికీ చెప్పాను, పరీక్షలకు తప్పనిసరిగా వచ్చి తీరాలని. ఒక వేళ రాకపోతే మీకు చెప్పి.. ఫెయిల్ చేయిస్తానని భయం కూడా పెట్టాను. అందరూ తప్పనిసరిగా వచ్చి పరీక్షలు రాస్తారు మేడమ్’’ నా స్వరం లో ఒకింత ఆత్మ విశ్వాసం ఎక్కువగానే పలికింది. ప్రతిగా మేడమ్ ముఖం లో చిరు గర్వం తో కూడిన దరహాసం తొణికిసలాడింది. ఆ భావాన్ని బయటికి కనిపించనివ్వక, ‘‘ఆ.. పడమటి వైపున ఉన్న షెడ్డు పక్కన రూమ్ లో గోడకి పెద్ద బొరియ పడిందట. అక్కడేదో పాము తిరుగుతుందని వంట మనిషి సుంకన్న ప్రొద్దున్న నాతో చెప్పాడు. ఆ రూమ్ లో మాత్ర్రం పిల్లలను పరీక్షకు కూర్చో బెట్టకండి.

‘‘సార్, నేను రేపటి నుండి ఆన్ డ్యూటీ పై పదో తరగతి స్పాట్ వాల్యేషన్ కు వెళ్తున్నాను. స్కూల్ జాగ్రత్త సార్. ఆల్ ద బెస్ట్’’ అంటూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసి నాకు కర్తవ్య బోధ చేశారు మేడమ్.

‘‘మధూ ఓ రెండు ఛాక్ పీసులు తీసుకుని నా వెంట రా. పిల్లలకు రూమ్ అలాట్ చేయాలి. త్వరగా వచ్చెయ్’’ అంటూ వాలెంటీర్ ను పిలుస్తూ.. మేడ మీద గదుల వైపుకి వెళ్లాను.
ఎదురుగా వస్తున్న అరవ తరగతి పిల్లలు ఇద్దరు గబగబా మేడ మెట్ల పైకి పరుగులు తీసారు – ‘‘సార్ వస్తున్నారు మన క్లాస్ లోకి’’ అనుకుంటూ.

క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టిన వెంటనే, ‘‘నమస్తే సార్!’’ అంటూ రాగయుక్తంగా అందరూ ఒక్క సారిగా గట్టిగా చెప్పడం తో చిన్నగా నవ్వుతూ... ‘‘ఏమ్మా అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా పరీక్షలకు? రేపటి నుండే మీకు పెద్ద పరీక్షలు’’ అంటూ పలకరించాను.
‘‘అందరమూ రేపటి పరీక్షలకు రడీ సార్! ఇక మీదే ఆలస్యం’’ అని ఎంతో ఉత్సాహంగా అరిచాడు ప్రకాష్. వాడి లోని ఆత్మ స్థైర్యాన్ని చూసి, చాలా సంతోషమేసింది మనసుకి.
‘‘వెరీ గుడ్’’ అంటూ వాడి భుజం తడుతూ కళ్ళ లోనికి చూశాను. ఏదో తెలియని మెరుపు కనిపించింది ఆ చిన్ని కళ్ళ లో! కాసింత గర్వంగా చూశాడు వాడు మిగిలిన వారి వైపుకు. ‘‘చూసారా.. సార్ నన్ను మెచ్చుకున్నారు’’ అనే గొప్ప భావన ప్రస్ఫుటమౌతుంది.

‘‘భాషా అన్నా!, పరీక్షకు టైం అవుతోంది. ఫస్ట్ బెల్ కొట్టేసెయ్. ఆ వరండాలో ఉన్న పిల్లలందరినీ రూముల్లోకి వెళ్ళమని చెప్పు’’ అని పిల్లలకు వినపడేడట్లు గానే కాస్త గట్టిగా చెప్పాను అటెండర్ కు. పిల్లలందరూ బిల బిలమంటూ క్లాస్ రూమ్ లోకి పరుగు తీస్తున్నారు. మొదటి గంట మ్రోగింది. స్కూల్ గేట్ నుండి పరుగులు పెడుతూ ముత్యంలా మెరిసిపోతూ .. రెండు కనుబొమల మధ్య ఎర్రని కుంకుమ బొట్టు తో, శుబ్రమైన తెల్లటి షర్ట్, మడత పడని ఖాకీ నిక్కరుతో, ఎడమ చేతిలో పరీక్ష అట్ట, కుడి చేతిలో రెండు పెన్నులు, ఒక పెన్సిల్ పట్టుకుని యుద్ధానికి సిద్ధపడే సైనికుడిలా వస్తున్న ప్రకాష్ ను చూసి మనసులో కొంత వాత్సల్యం కలిగింది.

‘‘సార్, వీడు ఈ రోజు కూడా బడికి వచ్చినాడు చూడు సార్. అక్కడ ఇంటి దగ్గర .....’’ అంటూ ప్రకాష్ గురించి ఇంకా ఏదో చెప్పబోతున్న షరీఫ్ ను వారిస్తూ, ‘‘ఏమీ  లేదులే సార్. వీడి మాటలు పట్టించు కోవద్దు’’ అంటూ షరీఫ్ ను సున్నితంగా పక్కకు తోసాడు ప్రకాష్.  
వాడి కళ్ళలో నేను ఎప్పుడూ చూడని కొంత అసంతృప్తి, ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. పరీక్ష హాల్ లోనికి వాడు వెళ్ళిపోయాడు. బహుశాః కొంత పరీక్ష టెన్షన్ అయి ఉండవచ్చని అనుకుంటూ... అటెండర్ ను పిలిచి రెండవ బెల్ కొట్టమని చెప్పేందుకు ఆఫీస్ గది వైపుకు నడుస్తున్నాను. పిల్లలిద్దరి మాటల పట్ల నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎదురుగా వస్తున్న లెక్కల మాష్టారు శంకర రెడ్డి ‘‘ఏం మాస్టారూ, ఈ రోజు పరీక్షకు అన్ని క్లాసుల లోనూ హాజరు సెంట్ పర్సెంట్ లాగే ఉందే! పరీక్షల కంట్రోలర్ గారు ఏం మాయ చేసారో మాకూ కొంచెం చెబుతారా?’’ అంటూ జోక్ చేశాడు.

మనసులో కొంచెం గర్వం కలిగింది. పిల్లలందరినీ పరీక్షకు రప్పించ గలిగినందుకు. ‘‘ఆఁ .. ఏముందీ! పరీక్షలకు రాని వాళ్ళందరినీ ఫెయిల్ చేస్తానని చిన్నగా బెదిరించాను. అంతే, అందరూ భయపడి శ్రద్ధ గా పరీక్ష రాయటానికి వచ్చారు’’ అన్నాను. ‘‘అంతే లెండి మాస్టారూ.. ఈ పిల్లలకు ముఖ్యంగా మీ ఆరో తరగతి పిల్లలకు ఆ మాత్రం బెదిరింపులు లేకపోతే బొత్తిగా మాట వినరు లెండి’’ అంటూ చిరునవ్వు నవ్వారు. పరీక్ష జరుగుతున్న రూమ్ లోనికి స్వయంగా వెళ్ళి, పిల్లలు ఎలా రాస్తున్నారో పరిశీలించి రావాలని ఒక గంట తరువాత రూమ్ విజిట్ కు బయలు దేరాను. ఆఫీసు రూమ్ నుండి బయటకు వస్తూండగా, స్కూల్ కాంపౌండ్ కు కొద్ది దూరం నుండి ఎవరో పెద్ద వాళ్ళ ఏడుపులు, అంతలోనే ‘‘రఘుపతి రాఘవ రాజా రాం’’ కీర్తనను సన్న మేళం పై పలికిస్తున్న శబ్దాలు వినిపించాయి.
పాపం ఎవరో కాలం చేశారని అనుకుంటూ పరీక్ష రూమ్ లోనికి అడుగు పెట్టాను. పిల్లలందరూ నిశ్శబ్దంగా తలలు వంచుకుని ఎవరి పాటికి వారు రాస్తున్నారు. గదిలో కుడి వైపు చివరన కుర్చున్న ప్రకాష్ దీక్షగా పరీక్షను రాస్తున్నాడు. వాడి పక్కనే నిలుచున్నాను ఓ రెండు నిముషాల పాటు. కన్నెత్తైనా వాడు నాకేసి చూడలేదు. ప్రశ్న పత్రాన్ని ఎడమ చేతిలో పట్టుకుని, తదేకంగా అందులోకి చూస్తున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పక్కకు మరలాను.

అన్ని రూములూ తిరిగి వచ్చి నా చెయిర్ లో కూర్చున్నాను. ఇంతలో అటెండర్ భాషా హడావుడి గా లోపలికి రావడం చూసి.., ‘‘ఏమైందన్నా?’’ ‘‘అనడిగాను. ‘‘సార్, మన స్కూల్ లో ఆరవ తరగతి ప్రకాష్ వాళ్ళ చిన్నాయన వచ్చినాడు. వాణ్ణి వెంటనే ఇంటికి పిలిపించమని అడుగుతున్నాడు సార్’’ అన్నాడు భాషా కాస్త బాధగా ముఖం పెట్టి.
‘‘ఏం.. ఎందుకు? పరీక్ష అయిపోయేందుకు ఇంకా దాదాపు ఒకటిన్నర గంట సేపు మిగిలి ఉంది. పరీక్ష చక్కగా రాస్తున్న పిల్లవాణ్ణి ఇంత ముందు ఎలా పంపిస్తాం?’’ అన్నాను అసహనంగా!

ఈ లోపు ప్రకాష్ వాళ్ళ బాబాయి రూమ్ లోనికి వచ్చాడు. ‘‘సార్... మా వాణ్ణి త్వరగా పంపించండి సార్. అక్కడ అన్నీ పూర్తయినాయి. వాడొస్తే అందరూ కదుల్తారు సార్. ఇంకా లేటయితే మిట్ట మద్ధ్యానం అవుతుంది. ఆయాల కాడ గుంతకు పెట్టరాదంటారు పెద్దోల్లు’’ అన్నాడు. ఒక్క క్షణం అతను చెప్పిన  విషయం ఏమీ అర్ధం కాలేదు నాకు. ‘‘అసలు విషయం ఏంటయ్యా? నాకు ఏమీ అర్ధం కావట్లేదు.  సరిగ్గా చెప్పు’’ కొంచెం ఆదుర్దాగా అడిగాను. అతను నా వైపు అయోమయంగా చూశాడు. నిజంగా నాకు విషయం తెలియకుండా ఉంటుందా..? లేక తెలిసీ.. తెలియనట్లు నటిస్తున్నానా అన్నట్లు.
‘‘సార్, ప్రకాష్ వాళ్ళమ్మ కు ఆరోగ్యం ఈ మధ్యన చానా బాగా లేకపాయ. ఆయమ్మ నిన్న రాత్రి చనిపోయింది సార్. ఆ పిల్లోడేమో ఈ పొద్దు నుండి పరీక్షలుండాయి, నేను బడికి పోయి పరీక్ష రాయకపొతే మా సారు బాధపడతారు. పైగా ఫెయిల్ చేస్తానని చెప్పినాడు. నేను పరీక్ష రాసి వస్తానని బడిలోకి వచ్చినాడు సార్. ఆడ కర్మలన్నీ పూర్తి చేసినాము. పిల్లోడు నిప్పు పట్టుకోవడానికి రావల గదా.. సార్. ఈ సారికి ఫెయిల్ చేయమాక సార్’’ చేతులు జోడించి అతను అడుగుతుంటే, ఒక్క నిముషం నాకు మెదడు మొద్దుబారి పోయింది. దిగ్గున లెచీ, వేగంగా పరీక్ష రూము వద్దకు పరుగు లాంటి నడకతో వెళ్ళాను. నేను వెళ్ళే సరికి ఆన్సర్ షీట్లకి దారం కడుతూ.. నాకేసి చూశాడు వాడు.

‘‘ఎందుకు వచ్చావురా ఈ రోజు పరీక్షకు?’’ కంఠంలో బాధ అణుచుకోవాలని ప్రయత్నించాను.
‘‘జీవితంలో గొప్పవాడు కావాలి అంటే, బాగా చదివితే మాత్రమే చాలదు. పట్టుదలతో చేపట్టిన పనిని పూర్తి చేసి తీరాలని మీరే కదా సార్ చెప్పారు. నేను గొప్పవాడిని అవుతానని ఎన్నో సార్లు మీరే చెప్పారు. అందుకే మీ మాట నిజం చేయాలని పరీక్ష రాయటానికి వచ్చాను సార్. మీ మాట అబద్దం కాకూడదు సార్’’ బింకంగా జవాబిచ్చాడు ప్రకాష్.
‘‘కానీ మీ అమ్మ....’’ అంటూ మిగతా విషయాన్ని ఆ చిన్న వాడికి చెప్పలేక ఆపేశాను.
‘‘గడచి పోయిన కాలాన్ని, తరలి పోయిన వారిని పొందలేము అని మీరే కదా సార్ చెప్పారు. అందుకే పరీక్ష త్వరగా రాసేసి వెళ్తున్నా సార్’’ అంటున్న వామనమూర్తి లాంటి ఆ పసివాడు, ఆ క్షణంలో నా మనసుకు ఆకాశానికి ఎదిగిన త్రివిక్రముడి లాగ అన్పించాడు. కేవలం క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠం బోధించే సమయం లో చెప్పిన పుస్తకాలలోని సూక్తులకు అంతటి మహత్తు ఉందా అని ఆశ్చర్యం తో ఆలోచన లోనికి జారుకున్నాను.

పరీక్ష ముగించి మరొక అర్ధ గంట తరువాత, ప్రకాష్ ఇంటి వద్దకు బయలుదేరాను. కన్న తల్లి అంతిమయాత్ర లో   ముందు భాగంలో కుడి చేతిలో నిప్పును, ఎడమ భుజం పైన కుండను మోస్తూ.. కళ్ళ నిండా నీళ్ళతో ఎదురు వస్తున్న పదకొండేళ్ళ చిన్నారి ప్రకాష్ ను చూసి, మహా భారతం లోని గీతాచార్యుడు ప్రవచించిన ‘‘కర్మ యోగి’’ నా కళ్ళెదుటే సాక్షాత్కరించాడు. బడి పిల్లలకు పుస్తకం లోని పాఠాలను బోధించే నాకు ఆ పసివాడి లో ఆత్మ జ్ఞానాన్ని ప్రభోదించిన ఆది శంకరుడు గోచరించాడు.

-- మౌనంగా రోడ్డు పక్కన నిలబడి మనసులోనే నమస్కరించాను.

(నా నిజ జీవితంలో ఇటీవల జరిగిన ఒక యధార్ద సంఘటన ప్రేరణ తో, నా ప్రియ శిష్యునికి జన్మ నిచ్చిన ఆ పవిత్ర మాతృ మూర్తికి అంజలి ఘటిస్తూ...........కామిశెట్టి చంద్రమౌళి)
   
Untitled Document
 
Date : 08/10/2016
ramasarma:  చాలా ఆర్ద్రం గా ఉంది సార్. అభివందనాలు