కథలు »
   
 
పరామర్శలపర్వం  . 
మా ఆఫీస్ లో కొత్తగాచేరిన మా కోలీగ్  పాపారావు చాలా  అమాయకుడు. అతడికి ఎవరితో ఎలా మాట్లాడా లో  తెలీదు. ఒకే ఒక సంతానమట అతడు వాళ్ళమ్మానా న్నలకు. వాని బాల్యం , చదువు అంతా వారి స్వగ్రామంలోనే  జరిగిందిట. వాళ్ళ తాత పెద్ద భూ స్వామి. ఎలాగో ఓపెన్ యూని వర్శిటీలో డిగ్రీ పూర్తి  చేసి , వాళ్ళతాత  పలుకు బడితో మా ఆఫీస్ లో ఉద్యోగం సంపా దించా డితడు. తన పల్లె నుంచే ఆఫీస్కు రోజూ వస్తుంటాడు బైక్ లో .  మనుషుల తో కలిసింది తక్కువ కావటాన పాపం  ఎవరి నెలా  పలకరించాలో తెలీదు.  మా నాయన గారు వాళ్ల తాత  గారికి ఎరుకైనందున పాపారావు ఉద్యోగంలో చేరే రోజున ఆయన నన్ను పలకరించి " బాబూ!  మావాడు  కాస్త  అమాయకుడు, లోకరీతి తెలీదు, ఎప్పుడూ బయటికి పంపక పోడం నాదే తప్పు.  కాస్త  సాయంగా ఉండు బాబూ! మాకు ఒక్కగానొక్క వారసుడు." అని చెప్పారునాకు.

నేను తప్పక సాయంగా ఉంటాని మాట ఇచ్చాను . అందరినీ వింతగాచూస్తూ, ఎవరైనా పలకరిస్తే  తల వంచు కుంటూ, అనుమానం వస్తే నన్ను మాత్రమే అడుగుతూ ఉద్యోగపర్వం కొన సాగిస్తున్నాడు పాపం.  రాను రానూ ఎవ్వరూ అతడితో మాట్లా డక పోడం అతడికి అవమానంగా అనిపించి నట్లుంది. ఒకరోజున   నాతో," ఏమండీ ! యాదగిరి గారూ ! మీతో అందరూ  చాలా బాగా మట్లాడతారు, నాతో ఎవ్వరూ మాట్లాడ రేమండీ!  " అన్నాడు ఆశ్చర్యంగా  పాపారావు .                                                                                                                                            "ఏముంది పాపారావ్! ఎవరికైనా కష్టం కలిగితే వాళ్ళను కాస్త  పలకరించి మాట్లాడి సానుభూతి  తెలిపితే సరి. మన మంటే వాళ్ళ కు మంచి అభిప్రాయం , స్నేహ భావం కలుగుతాయి  .వాళ్ళే  మనల్ని పిల్చి మాట్లాడ తారు. కష్టంలో సాను భూతి చూపడం మ న ధర్మం కూడానూ " అన్నాను.                                                                                                                                                           " ఓహో అలాగా! ఈమారు మీరు సానుభూతి చూపను వెళ్ళేప్పుడు  నన్నూ పిలవండి, మీ కూడా  నేనూవస్తాను, ఎలా సాను భూ తి చూపాలో తెల్సుకుంటాను, నాకూ మీలా చాలామంది స్నేహితులు కావాలనే  కోరిక ఉందండీ!" అన్నాడు  .నాకు పాప మనిపించి   " అలాగే తప్పక నాతో  తీసుకెళ్తాగా!" అని భరోసా ఇచ్చాను.                                                                               

పిల్లిని  చంక కెత్తుకెళుబోతున్నట్లు నాకప్పటికి తెలీదుగా !  ఇది జరిగిన ఒక వారంలోనే మా మేనేజర్ పెంపుడు కుక్క చని పోయిం ది. అది ఆయనఆరో ప్రాణం.అతడు చాలా దిగులుగా ఉండటం చూసి, "రావోయ్ ! పాపారావ్! మేనేజర్ గారి ఇంటి కెళ్ళి పరామర్శించివద్దాం"  అనిపిల్చుకెళ్ళాను.                                                                                                                                         ఆయన మమ్మల్ని చూసి బావురు మన్నాడు "సార్! మీకు మీ మనోజ్ అంటే ఎంతిష్టమో మాకు తెల్సుకదా! వాటి జీవిత కాలం తక్కువ కదాసార్! అనుబంధం చాలా గొప్పదే, ఐనా ఇలాంటివి సహజం, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు త్వర లోనే  మరో మనోజ్ ను తెచ్చుకుని  వాడిలో వీడ్ని చూసు కోవచ్చు. ధైర్యంగా ఉండండి సార్!  మీరిలా ఉంటే మాకు చాలా బాధగా ఉంటుంది.  మీకు తోడుగా కావలిస్తే నేను వస్తాను మరో మనోజ్ ను తెచ్చుకోను ఈవారాంతంలో  వెళ్దాం " అని ధైర్యం చెప్పి కాస్త సేపు కూర్చుని వచ్చాము.     తర్వాత పదిరోజులకు మరో సంఘటన జరిగింది.మా ఆఫీస్ ప్యూన్ పాండూకు ఒక గుర్రపు బగ్గీ ఉంది. పాండూకు ఉద్యోగం రాక ముందు అతడే ఆ బండిని సంతకు కూరగాయలూ, మనుషులూ వెళ్ళను  తోలుతూ వచ్చిన సొమ్ముతో జీవించే వాడు. మా పాత ఆఫీసర్ తో ఎలాగో పరిచయమై ఆయన మాటతో ఈ ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం వచ్చాక ,ఏపనీ చేయని  వాని తమ్ముని కి ఇచ్చి వాడుక బాడుగలు తోలిస్తు న్నాడు పాండూ .ఆ గుర్రం చాలా చలాకీగా ఉంటుంది.పాండూకు అదంటే ప్రాణం. తెల్లగా మంచు ర్మగులో ఉంటుంది,దేవాసవంలా.అతడు దానికి 'అశ్వరాజ్ ' అనిపేరు కూడా  పెట్టుకున్నాడు.రోజూ వాడే దానికి దాణా  పెడుతుంటాడు. ఆతర్వాతే తాను తిని, పనికి వచ్చేవాడు. వాని తమ్ముడు ఆఫీస్ వరకూ పాండూను దింపి తనపనిమీద వెళ్ళే వాడు .ఒకరోజున ఆఫీస్కు నడిచి ఆలస్యంగా ఏడుస్తూ వచ్చాడు పాండూ.అంతా ఏమైందేమైందని అడిగాం. తమ్ముడు బండి తోలుతుండగా కొత్తగా వచ్చిన 'యమహా ఎఫ్‌జెడ్ ' బైక్ శబ్దానికి బెదిరిన గుర్రం అడ్డ దిడ్డంగా పరిగెత్తి లోయలో పడింది, మర ణించిందిట.   పాండూ తమ్ముడు బయటికి దూకేసి దెబ్బలతోనైనా ప్రాణాలతో బయటపడ్డాడు. అందరం పాండూను ఊరడిం చాం. "పాండూ! తలాకొంత సాయంచేస్తాం, ఆఫీసర్ గారినడిగి కొంత లోన్ తీసుకో. ఎలాగోలా మరో అశ్వరాజ్ ను తెచ్చుకో . ఏంచే స్తాం ఒక్కోమారు ప్రమాదాలు అలా వస్తాయ్ ! పోయిన వాటితోపోలేంకదా! నీకు అశ్వరాజ్ అంటే ఏంతిష్టమో మాకంతా తెల్సు . పాండూ! రిలాక్స్ ,రిలాక్స్  .."  అంటూ ఓదార్చాం.                                                                                                                                  తర్వాతి వారంలో మా ఆఫీసర్ అంటే మా కొత్త బాస్  భర్త వల్లభ్ కారు యాక్సిడెంట్ లో  పోయారు. వారిది ప్రేమ వివాహం. వయ స్సూ తక్కువే! ఆఫీస్ స్టాఫంతా పలక రింపుకూ ,పరామర్శకూ  వెళ్ళాం. నేనూ  వెళుతుంటే నాతో పాటు తానూ వస్తా నని పాపా రావూ వచ్చాడు. అందరం మౌనంగా కూర్చుని ఉన్నాం, మా మేడంతో ఏం మాట్లాడాలో  తోచక, ఆమెకు వచ్చిన కష్టం  తల్చుకు ని  అంతా విచారంగా తలలు వంచుకుని కూర్చున్నాం.                                                                                                                  .     ఇంతలో పాపారావు ఉన్నట్లుండి " మేడం! ఇదంతా సహజం కదా! ధైర్యంగా ఉండండి మేడం! మీకు మీ వల్లభ్  గారంటే ఎంతి ష్టమో  అందరికీ  తెలిసిందే కదా! ఐనా ఇలాంటివి సహజం కదా మేడం, మీరు ధైర్యంగా ఉండాలి, కావలి స్తే మరో వల్లభ్ ను తెచ్చు కోవచ్చు,మీకు తోడుగా మేమంతా కూడా వస్తాం, మరో వల్లభ్ తెచ్చుకోను,ఆవల్లభ్ లో ఈ వల్లభ్  ను చూసు కోండి మేడం"అన్నా డు. అంతే మామేడం కళ్ళ లోంచీ కన్నీరు కాక నిప్పులు కురిశాయి.  అతడ్ని వెంట బెట్టు కొచ్చిన నావైపూ కాస్త వేడి చూపు లు తగిలి, నాగుండె తల్లడిల్లింది. అంతా పాపారావును  నానా మాటలూ అని తరిమే శారు. నేనూ మా బాస్ మేడం ముందు  మరికాస్త పాపారావును తరమడంలో  ప్రముఖపాత్ర పోషించాను, నాకూ వానికీ ఏవిధమైన సంబంధం, లేదని ఋజువు చేసుకుందుకు.   తర్వాతి వారంలో మా బాస్ ఆఫీస్ కు రావడం పాపారావుకు ఊస్టింగ్ ఆర్డర్స్ రావడం జరిగాయి.                                                           " యాదగిరి గారూ! నేనేం అన్నానండీ! ఆవిడ కంత కోపం వచ్చి ఉద్యోగం ఊడబీకిందీ! మీరు మేనేజర్ కు చెప్పి నట్లే, పాండూకు చెప్పి నట్లే నేనూ సానుభూతి మాటలు  చెప్పాను  అంతేకదా! " అన్న పాపారావు ను చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకు న్నాను. 

   
Untitled Document