కథలు »
   
 

‘‘ఎంటోయ్ మధూ.. ఆఫీసు నుండా రావడం’’ అంటూ టూత్ పేస్టు యాడ్ లో యాక్టర్ లాగ పళ్ళన్నీ బయట పెట్టి అడిగిన పక్క పోర్షన్ మూర్తి గారితో ‘‘ఔనండీ ఆఫీసు నుండే’’ అంటూ చిన్న చిరునవ్వు తో చెప్పి, తర్వాత నడిచి ఇంట్లోకి వెళ్లబోతూ కాస్త ఆశ్చర్యంగా ఓ క్షణం ఇంటి పరిసరాలు గమనించి, ‘‘ఇది నా కొంపేనా...?! ఎప్పుడూ రణరంగం లా ఉండేది. ఇప్పుడేంటి వింతగా, ఇంత ప్రశాంతంగా ఉంది. అసలు ఈ వేళకి మా బబ్లూ గాడు చెవులు చిల్లులు పడే పెద్ద సౌండుతో టీవీ కనెక్టెడ్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉండాలి. అలాంటిది వీడు ఇంత ప్రశాంతంగా సోఫాలో కూలబడి పోయాడేంటి? అలాగే ఈ టైంకి మా అమ్మాయి పెద్దగా అరుస్తూ సెల్ ఫోను పట్టుకుని అట్నుండి ఇటు, ఇట్నుండి అటు తిరుగుతూ మాట్లాడుతూ ఉండేది. మరి, ఇప్పుడేంటీ..? ఇంత కామ్ గా, దీనంగా దివానీ కాట్ పై వేలాడిపోయి కూర్చుంది. ఇక నా భార్యామణి అయితే టీవీ ముందు కుర్చుని అసలు నేను ఏ పని చెప్పినా, పిలిచినా పట్టించుకోకుండా ఆ సీరియల్స్ లోనే లీనమైపోయేది. అలాంటిది ఈ రోజు కనీసం టీవీ పెట్టను కూడా పెట్టలేదు. ఏంటబ్బా సంగతి!’’ అని మనసులో అనుకుంటూ, అమితాశ్చర్యంగా ఇంట్లోకి ప్రవేశించి, ‘‘ఏంటర్రా.. మన గృహం ఇంత ప్రశాంతంగా ఉందీ’’ అంటూ తన శ్రీమతి పక్కనే కూర్చున్నాడు.
‘‘ఏం చెప్పమంటారండీ...  మా జీవితాల్లో సరదాకి చెల్లు చీటి. మా సంతోషానికి కొద్ది రోజుల పాటు సమాధి. మా జీవితాలకి కొన్ని రోజులు గ్రహణం పట్టబోతోంది. అందుకే ముందు నుండీ ఇలా ఆ జీవితానికి అలవాటు పడుతున్నాం’’ చెప్పింది లలిత అసహనం, నీరసం కలగలిపిన స్వరంతో.
‘‘ఇలా అరవ సినిమా హీరోఇన్ తెలుగు మాట్లాడినట్లుగా కాక, కొంచెం అర్ధమయ్యేలా అఘోరిస్తావా’’ అడిగాడు మధు.
‘‘ఏముంది? మీ నాన్న గారు రేపు వస్తున్నారని ఫోను చేశారు. అదే మా బెంగకి కారణం’’ చెప్పింది లలిత మరింత నిరాశ పడిపోతూ.
‘‘అలాగా అయినా మా నాన్న వస్తే ఏం? ఆయనొస్తే మీకెందుకు బెంగా’’.
‘‘ఎందుకా! అప్పుడే పాత రోజులు మరిచిపోయారా...? అంతెందుకు మొన్న ఓ  ఆరు నెలల క్రితం ఆయన పంట డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడు క్రమశిక్షణ, కాకరకాయ అంటూ మా దుంప తెంచేశారు. అందుకే మాకు ఈ బెంగా, పింగూ’’ చెప్పిందామె.
‘ఓహ్.. అదా! ఆయన రిటైర్డ్ మిలట్రీ మేజర్ కదా. అందుకే కొద్దిగా చాదస్తం ఉంటుంది’’ నచ్చ చెప్పే ప్రయత్నం చేసాడు.
‘‘కొద్దిగానా చాల్లెండి! ఆయనది ఊరంత చాదస్తం అయితే! లేకపోతే తెల్లవారు ఝామున బ్రహ్మ సమయంలో చదివితే మంచిదనీ, చదువు బాగా వంట బడుతుందనీ, ఉదయాన్నే మూడున్నర గంటలకి ఆయన నిద్ర లేచిందే కాక, పిల్లల్ని నిద్రలేపే వారు. దాంతో పిల్లలు మనల్ని లేపే వాళ్ళు. పొనీలే అనుకుని ఆ వయసులో అంత చలి లో చన్నీళ్ళు ఏం చేస్తారులే అని ‘‘వేడి నీళ్ళు పెట్టమంటారా మావయ్యా’’ అని అడిగాను. అందుకు గైమని లేచి ‘‘వేడి నీళ్ళు ఒంటికి మంచిది కాదు. బద్దకం పోవాలన్నా, నిగ్రహాన్ని, ఏకాగ్రతనీ పొందాలన్నా చన్నీటి స్నానం చాలా మంచిదమ్మా’’ అన్ని క్లాసు పీకి, అందర్నీ చన్నీటి స్నానమే చేయమని ఆర్డర్ వేశారు. పోనీ ఎలాగోలా ఆయన గోల  కొద్దీ ఆ చలిలో స్నానాలు కానిచ్చి ...
బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తుండగా మళ్ళీ అంతే గైమని అంతెత్తున లేచి ‘‘ఓవెన్ లో ఆహారం వండొద్దూ, ఆరోగ్యానికి హానికరం. జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలా కొన్నేళ్లు వాడినా కాన్సర్ వచ్చే కారకాలు శరీరంలో పెరిగే అవకాశం ఉంది కనుక, ఓవెన్ కి బదులుగా సాధారణ పొయ్యి పైనే వండాలి’’ అని మరో ఆర్డర్ వేశారు.
పోనీలే బతుకు జీవుడా అని ఏదో నాకు తోచింది వండితే మళ్ళీ గైమన్నారు.
‘‘ఆ.. కట్ లెట్సు, ఆమ్లెట్లూ లాంటివి పొద్దు పొద్దునే తింటే గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటివి వస్తాయి కనుక సాత్వికమైన నూనె లేని ఆహారం అంటే ఇడ్లీ, ఊతప్పం, గోధుమ రొట్టె లాంటివి చేసుకు తినాలి. మీరు అమెరికా నుండి వచ్చి రెండేళ్ళు అయినా.., ఇంకా ఆ అలవాట్లు మానుకోపోతే ఎలా?’’ అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చారు.
పోనీ నా విషయం పక్కన పెట్టండి. మన అమ్మాయి ఏదో కొద్దిగా ఎక్కువ సేపు సెల్ ఫోనులో మాట్లాడుతుందని, దానిని పక్కన  కూర్చోబెట్టుకుని రేడియేషన్ వల్ల వచ్చే అనర్ధాలని అనర్గళం గా చెప్పి, ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ల్యాండు లైను మాత్రమే వాడాలని, అలా చేస్తే రేడియేషన్ నుండి ఉపశమనం దొరుకుతుందని అదో ఆర్డర్ వేశారు.  దాంతో మనమ్మాయి చేసేది లేక సెల్ పక్కన పడేసింది.
ఇక మన బబ్లూ గాడు ఏదో నెట్ లో విడియో గేము ఆడుతూ పొరబాటున ఏదో హీరోఇన్ సైటుని ఓపెన్ చేసేడట. అది చూసి, వాడి చెవి మెలేసి, ‘‘పెద్దల సైటుని పిల్ల కాకివి నువ్వు చూసి తగలడతావా...? అయినా పద్దెనిమిదేళ్లు దాటకుండా నీకు ఇంటర్నెట్ ఇచ్చినందుకు మీ నాన్నని అనాలి’’ అంటూ పిల్లాడ్ని గూబ గులాబ్ జాములా వాచేట్లు చెంప పగలకొట్టారు. చూడండి వాడు తాతంటేనే ఎలా వణికి, గోడకి వాలిపోతున్నాడో... చెప్పిందామె కళ్లొత్తుకుంటూ!
అలా అంటావేమిటి లలితా ఆయనకి మన మీద ఏమైనా శతృత్వమా? రిటైరైనా రిలాక్స్ అవకుండా వ్యవసాయం చేస్తూ, కౌలుకిచ్చిన పొలం డబ్బులో కొంత నాకు ఇవ్వటానికి ఇలా ఆరు నెలలకోసారి వస్తారు. ఆయన ఆ డబ్బు ఇవ్వబట్టే మన విలాసాలు కులాసాగా సాగిపోతున్నాయి.
ఆయనకి ఇదంతా ఇలా అని చెప్పే ధైర్యం నాకు లేదు. కనుక, మీరే ఆయనున్న వారం పది రోజులూ.. మీ అమెరికా అలవాట్లు మార్చుకోండి.
ఇందులో ఇంకో సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మా నాన్నే రావటం. మా అమ్మ గురించి మీకు తెలీదు! మా నాన్నకి క్రమ శిక్షణా, ఆరోగ్యం లాంటి విషయాలలోనే ఛాదస్తం. అదే మా నాన్నకి బదులుగా, మా అమ్మ గానీ వచ్చిందంటే మానసిక వికాసం, మనశ్శాంతి, మనో నిబ్బరం పెరుగుతుందని చెప్పి, నిన్ను పూజలూ, వ్రతాలూ, నోములు చేయమంటుంది. ఒంటికి మంచిదని ఉపవాసాలు చేయమని నీ కడుపు మాడ్చేసేది. భక్తి పేరు చెప్పి నిన్ను ఆ గుడికి, ఈ గుడికీ, గోపురానికీ రమ్మని నీ ఒళ్ళు కరిగించేసేది.
ఇక ఆవిడ ఉన్నంత కాలం శాఖాహారం మాత్రమే వండమని, మీకూ చికెన్ కూ ఉన్న అనుబంధం తెంచేసేది. ఇక గుమ్మం దగ్గర కళ్ళాపు ముగ్గుల దగ్గర్నుండి.. మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, పూజా పునస్కారం అంటూ నీ సహనానికి పరీక్ష పెట్టేస్తుంది. ఇక పిల్లల పర్సనాలిటీ డెవలప్ మెంట్ కి భగవద్గీత ఒక మంచి మార్గం అని నిన్ను చదివి వినిపించమంటుంది.
అందుకే మా నాన్న రావడమే ఎంతో నయం. సో... కూల్ గా ఉండు’’ అని నచ్చ చెప్పాడు మధు.
ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి, మొదటి దాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేసాడు.
ఆ మాటలు విన్న లలిత మొదట ఆలోచనలో పడి, ఆ తర్వాత స్థిమిత పడి, ‘‘ఔనండీ...! మీరంటుంటే నాకూ అనిపిస్తుంది. ఓ సారి మావయ్య గారు బిజీగా ఉండి అత్తయ్య గారిని పంపారుగా, అప్పుడు ఆవిడ ఉన్న ఆ రెండు రోజులూ రెండు యుగాల్లా గడిచిందంటే నమ్మండి! ఆవిడతో పోల్చి చూస్తే మావయ్య గారే నయం’’ అంటూ కొంచెం నెమ్మదించి శాంత పడింది లలిత. దాంతో తన నచ్చ చెప్పే ప్రయత్నం సఫలం కావడం తో మధుకి చాలా సంతృప్తి, సంతోషం అనిపించింది.
మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగడంతో లలిత, ‘‘మావయ్య గారు వచ్చినట్లున్నారు’’ అని మనసులో అనుకుంటూ వంట గదిలోంచి హాల్లోకి గబగబా నడిచి వెళ్లి తలుపు తీసి ఓ క్షణం తక్షణంగా చూసి నిర్జీవంగా  ఆ తలుపుకి జారబడి పోయిందామె.
‘‘ఎవరు మమ్మీ వచ్చింది?’’ అంటూ ఉత్సాహం గా హాల్లోకి పరిగెత్తు కొచ్చిన పిల్లలు, గుమ్మం వైపు కళ్ళప్పగించి చూస్తూ.. పులిని చూసినంత భయంగా ‘‘డాడీ....’’ అంటూ స్వరం లో ఏడుపు ద్వనించేలా దీనంగా పిలిచారు మధుని.
దాంతో మధు, చదువుతున్న న్యూసు పేపరు టీ పాయ్ పై పడేసి, ‘‘ఏమైందర్రా?’’ అంటూ హాల్లోకి వేగంగా నడిచి వచ్చి గుమ్మం వైపు చూసి, మనసులో ఓ క్షణం ‘‘అమ్మో’’ అనుకుని,
‘‘అమ్మా, నాన్నా..! ఇద్దరూ కలిసి వచ్చారా? సంతోషం’’ అని పైకి అనేసి లలిత వంక చూశాడు.
లలిత వారిరువురి వంక భయం భయం గా చూస్తూ – ‘‘అంటే మాకు రెండు వైపులా క్రమ ‘‘శిక్ష’’ ణ తప్పదన్న మాట. మొత్తానికి మా పరిస్థితి ఒకే పిట్టకి రెండు దెబ్బలు అన్నట్లుగా తయారవబోతుంది కాబోలు!’ అనుకుంటూ వారిని లోనికి ఆహ్వానించింది కృత్రిమ నవ్వుతో.
కానీ, మధుకి మాత్రం వారు తమ ఇంటిని చక్క దిద్దటానికి వచ్చిన రింగ్ మాస్టర్స్ లా అనిపించారు మరి.

   
Untitled Document
 
Date : 08/10/2016
ramasarma:  బాగుంది కధ
Date : 11/10/2016
Shyamvijji:  Chala baaga raasaru Gangadhar garu.. nice characters funny dialogues and a very apt n hilarious title
Date : 11/10/2016
Shyamvijji:  Chala baaga raasaru Gangadhar garu.. nice characters funny dialogues and a very apt n hilarious title
Date : 11/10/2016
Shyamvijji:  Good luck for future Sir
Date : 17/10/2016
kumar:  Chala chala manchi hasya kadha
Date : 05/11/2016
arun:  good story sir.keep it up